హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ (వేమూరి కావేరి ) బస్‌లో శుక్రవారం ( అక్టోబర్ 24) తెల్ల వారుజామున 3.30 గంటలకు ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని సమాచారం అందుతోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ వద్ద మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. బస్ కింద బైక్ చిక్కుకున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు చెలరేగాక.. బస్సు డ్రైవర్, సహాయకుడు, కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ అనే వ్యక్తి తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారే తప్ప ప్రయాణికులను పట్టించుకోలేదని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
►ALSO READ | వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో (ఇప్పటివరకు) 25 మంది మృతి.. 11 మృతదేహాలు బయటకు తీశారు.. ఇంకా పెరిగే అవకాశం..
చిన్న ప్రమాదమనుకుని వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మంటలుఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు. మందే ప్రయాణికులను అప్రమత్తం చేసినట్లయితే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు. ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇప్పుడే చెప్పలేం. హైవేపై వెళ్తున్నవారు కూడా సహాయం చేశారు.
రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవర్ల నిద్రమత్తు, సరిగా కనపడకపోవడం.. అతివేగంగా డ్రైవింగ్ చేయడం, వాహనాలకు సరైన రిఫ్లెక్టివ్ టేపులు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలని కొందరు అంటున్నారు. వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి చేయడం రోడ్లపై జాగ్రత్తగా ఉండటం వంటి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
