ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లు దొరుకుతలే.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 156 ఎలక్ట్రిక్ బస్సులు మూలకు

ఎలక్ట్రిక్ బస్సులకు  డ్రైవర్లు దొరుకుతలే.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 156 ఎలక్ట్రిక్ బస్సులు మూలకు
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 156 ఎలక్ట్రిక్ బస్సులు మూలకు
  • డ్రైవర్ల కొరతతో  రోడ్డెక్కని బస్సులు 
  • జీతాలు తక్కువ ఉండడంతో డ్రైవర్ల అనాసక్తి
  • డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ. 30 వేల టార్గెట్లు

నల్గొండ, వెలుగు: ప్రభుత్వం కాలుష్యం తగ్గించడానికి ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చగా..  వాటిని నడిపేందుకు డ్రైవర్లే దొరుకుతలేరు.  జీతాలు తక్కువగా ఉండడంతో డ్రైవర్లు రావడం లేదు. కొంతమంది డ్రైవర్లు ముందుకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నారు.  డ్రైవర్ల సమస్య ఆర్టీసీకి ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఎలక్ట్రిక్ బస్సులు డ్రైవర్లు లేక డిపోలకే పరిమితం అవుతున్నాయి. 

రెండు జిల్లాలకు 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు 

నల్గొండ రీజినల్ పరిధిలో మొత్తం 9 డిపోలు ఉండగా నల్గొండ, సూర్యాపేట డిపోలకు 156 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిలో నల్గొండ డిపోకు 77 ఎలక్ట్రిక్ బస్సులు, సూర్యాపేట డిపోకు 79 బస్సులను కేటాయించారు.  ఈ ఏడాది జూన్ నెలలో వీటిని ప్రారంభించగా మొదట ఎలక్ట్రిక్ బస్సులు కోసం 100 మంది డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చి రూట్ లను కేటాయించారు. ప్రజల నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు స్పందన బాగా ఉన్నప్పటికీ  డ్రైవర్లు మధ్యలోనే ఉద్యోగాలు వదిలివేస్తుండడంతో కొరతతో ఇప్పుడు బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. 

  జీతాలు తక్కువగా ఉండడమే సమస్య..

జేబీఎం సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ చేపట్టింది. డ్రైవర్లను, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకాన్ని థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. డ్యూటీలో ఎక్కిన డ్రైవర్లకు నెల రోజుల శిక్షణ అనంతరం బస్సులను కేటాయిస్తుండగా ఒక్కొక్క డ్రైవర్ కు పీఎఫ్, ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐతో కలిపి రూ. 22 వేలు చెల్లిస్తున్నారు.  

దీంతో జీతాలు తక్కువగా వస్తున్నాయని డ్రైవర్లు ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ముందుకు రావడం లేదు.   ప్రస్తుతం సూర్యాపేట డిపో పరిధిలో 79 బస్సులకు 65 బస్సులు, నల్గొండ డిపో పరిధిలో 77 బస్సులకు 45 బస్సులను నడిపిస్తున్నారు. ప్రస్తుతం బయట కారుకు ఒకరోజు డ్రైవర్ గా పని చేస్తే రూ.1200 చెల్లిస్తుండగా ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం తక్కువగా వస్తుండడంతో డ్రైవర్లు ఆసక్తి  చూపించడం లేదు. 

పెరుగుతున్న ఒత్తిడితో.. 

మరోపక్క డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీజన్ సమయంలో బస్సుల్ని అదనపు కిలోమీటర్లు తిప్పుతున్నారు. దీంతో డ్రైవర్లు చాలామంది ఒక డ్యూటీ అయిపోగానే కాస్త విరామం తర్వాత రెండో డ్యూటీ చేస్తున్నారు. ఇలా ఒక రోజులో దాదాపు 14 గంటలు విధుల్లో ఉంటున్నామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నామని ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ఎలక్ట్రిక్ డీలక్స్ బస్సులలో రోజుకు రూ. 30 వేల టార్గెట్ ఉంటేనే వారికి జీతాలను చెల్లిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.