55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్ అరెస్ట్

55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్ అరెస్ట్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో రూ.55 లక్షల నగదుతో పారిపోయిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీలో శ్రీనివాస్‌, అతని స్నేహితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారా హిల్స్ ACP సుదర్శన్ వివరాలు తెలిపారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10C ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే రియల్ ఎస్టేట్  బిజినెస్ మెన్ సంతోష్‌రెడ్డి దగ్గర ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. కోకాపేటలో ఉంటున్న ఓ రియల్టర్ కు రూ.55లక్షలు ఇచ్చి రమ్మని సంతోష్‌రెడ్డి డ్రైవర్‌కు సూచించాడు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌ కారులో నగదు తీసుకొని బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలు దాటినా కోకాపేట చేరుకోలేదు. 

అనుమానం వచ్చి డ్రైవర్ కి పలుమార్లు ఫోన్ చేసిన స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను ఇవాళ(గురువారం) అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించగా విజయ్ రాంబాబు అనే ఇద్దరు శ్రీనివాస్ కి  సహకరించినట్లు గా గుర్తించారు.  శ్రీనివాస్, విజయ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయలను ఒక సెల్ఫోను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.  మొత్తం 55 లక్షలను దొంగిలించిన నిందితులు 40 వేల తో సెల్ ఫోన్, 60000 బట్టలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న రాంబాబు ను అరెస్టు చేస్తే మరి కొంత డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు.