వెస్ట్‌పామ్ బీచ్ (యూఎస్): నైజీరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భీకర వైమానిక దాడులను నిర్వహించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నైజీరియాలో క్రిస్టియన్లపై జరుగుతున్న ఊచకోతను అరికట్టడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో ఈ దాడులు చేసినట్టు చెప్పారు.
ఈ మేరకు గురువారం ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్ట్ పెట్టారు. ‘‘నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై యూఎస్ శక్తిమంతమైన, ప్రాణాంతకమైన దాడులు ప్రారంభించింది. ప్రధానంగా అమాయకులైన క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్నవారిపై ఎయిర్‌స్ట్రైక్స్ చేశాం. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తాం.
ఇదివరకే నేను హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోను’’ అని వ్యాఖ్యానించారు. చనిపోయిన ఉగ్రవాదులతోసహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ హత్యాకాండ ఇలాగే కొనసాగితే.. తమ దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు.
కాగా, అమెరికా –ఆఫ్రికా కమాండ్ అందించిన సమాచారం ప్రకారం.. నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో ఈ దాడులు జరిగాయి. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు, వారి సమన్వయంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు.
నైజీరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను ధృవీకరించింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఇరు దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందాల ప్రకారం మేధో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది.
