సౌదీలోని మక్కా మసీదులో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సౌదీలోని మక్కా మసీదులో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • నాలుగో అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. కాపాడిన సెక్యూరిటీ గార్డ్  

మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదు నాలుగో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ముందే గమనించిన సెక్యూరిటీ గార్డు పరుగెత్తుకొచ్చి దూకిన వ్యక్తిని చేతులతో పట్టుకుని కాపాడాడు. శనివారం ఉదయం ఓ వ్యక్తి దూ మస్జిద్ అల్-హరామ్ (గ్రాండ్ మసీద్)​పైకి ఎక్కాడు. 

అతను నాలుగో అంతస్తుకు చేరుకుని బాల్కనీ అంచునుంచి దూకే ప్రయత్నం చేస్తుండగా హరామ్ సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ కు చెందిన గార్డ్​ గమనించి.. దూకొద్దని వారించాడు. అయినా అతను దూకేయడంతో పరిగెత్తుకెళ్లి చేతులతో పట్టుకున్నాడు. ఈ ప్రయత్నంలో దూకిన వ్యక్తితోపాటు సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. 

గార్డ్​ కాళ్లు, చేతులకు ఫ్రాక్చర్స్​ అయ్యాయి. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. మక్కా ప్రాంత ఎమిరేట్ ఆఫీసర్​ ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేయడంతో వైరల్​ అయింది. ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ గార్డ్​ను నెటిజన్లు అభినందిస్తున్నారు. 

ఈ ఘటన తర్వాత గ్రాండ్ మసీద్ చీఫ్ ఇమామ్ షేక్ అబ్దుర్ రెహమాన్ మాట్లాడుతూ.. మక్కా పవిత్రతను గౌరవించాలని, నిబంధనలు పాటించాలని కోరారు.