ఆర్టీసీలో కాపలా, హమాలీలుగా డ్రైవర్లు, కండక్టర్లు

ఆర్టీసీలో కాపలా, హమాలీలుగా డ్రైవర్లు, కండక్టర్లు
  • కొందరికి కాపలా డ్యూటీ
  • జంక్షన్లలో గైడ్​లుగా ఇంకొందరు

 నిజామాబాద్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో అసలు డ్యూటీలకు బదులు అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. కార్గో సర్వీసుల్లో హమాలీ .. డిపోలు, బస్​స్టేషన్ల దగ్గర సెక్యూరిటీ.. బస్ స్టాప్​లలో గైడ్​డ్యూటీలు వేస్తున్నారు. బస్సుల తగ్గింపు, హైర్​బస్సుల బంద్​వల్ల చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. వీరిని ఎక్సెస్​స్టాఫ్​గా ప్రకటించి అల్టర్నేటివ్ డ్యూటీలు వేస్తున్నారు. ఈ డ్యూటీలు చేయకపోతే ఆఫీసర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారని ఇలాంటి పనులు చేయిస్తున్న ఆఫీసర్లు.. రేపు ఎక్కడ ఉద్యోగాల్లోంచి తొలగిస్తారోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 
ఇదీ పరిస్థితి.. 
2019 సమ్మెకు ముందు టీఎస్ ఆర్టీసీలో10,460 బస్సులు ఉండగా,  గడిచిన19 నెలల్లో వెయ్యికి పైగా బస్సులను స్క్రాప్​ చేశారు.  నాలుగు నెలలుగా హైర్​బస్సు ఓనర్లకు రూ.105 కోట్ల అద్దె చెల్లించకపోవడంతో 3,200 బస్సులను ఆపేశారు. సుమారు180 బస్సులను కార్గో సర్వీసులుగా కన్వర్ట్ చేశారు. కొవిడ్​ తర్వాత వందలాది గ్రామాలకు ఆర్డినరీ బస్సులను బంద్​పెట్టడం, ఇన్​కం తక్కువగా ఉండే రూట్లలో బస్సుల ట్రిప్పులను తగ్గించడంలాంటి చర్యలతో ప్రతి డిపో పరిధిలో పెద్దసంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు మిగులుతున్నారు. వీళ్లను ఎక్సెస్​స్టాఫ్​గా చూపుతున్న ఆర్టీసీ అధికారులు.. డ్రైవర్లు, కండక్టర్లతో హమాలీ, సెక్యూరిటీ, బస్​స్టాప్​ల వద్ద గైడ్​ డ్యూటీలు చేయిస్తున్నారు. కూడళ్లలో గైడ్​ డ్యూటీ చేస్తున్న మహిళా కండక్టర్లు 8 గంటలకు పైగా నిలబడి ఉండాల్సి వస్తోంది. ఊళ్లకు వెళ్లేవాళ్లను వారివారి రూట్లలో వెళ్లే  బస్సుల్లో  ఎక్కించడం  వీరి పని. ఆయాచోట్ల మంచినీళ్లు, టాయిలెట్​ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  చెప్పినట్లు చేయకపోతే చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్ద పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే స్టేట్​వైడ్​ సుమారు 800 మందికిపైగా కార్మికులను సస్పెండ్ చేసి డిపో స్పేర్​లో పెట్టారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం(సీఆర్ఎస్) ద్వారా 55 ఏళ్లు పైబడిన వారిని, 33 ఏళ్ల సర్వీసు నిండినవారిని బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
హమాలీ, స్వీపింగ్‍ పనులు చేపిస్తున్నరు
ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత యూనియన్లు అవసరం లేదని సీఎం కేసీఆర్‍ వెల్ఫేర్‍ కమిటీలు వేసిండు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అవి ఫెయిలైనయ్‍. యూనియన్లు లేవు కాబట్టి అధికారులు ఇష్టారీతిన ఉద్యోగులతో హమాలీ, స్వీపింగ్‍ పనులు చేపిస్తున్నారు. ఈ విషయమై నిరసనలు తెలిపినా ప్రయోజనం లేదు. లేబర్‍ కమిషనర్‍, చీఫ్‍ సెక్రటరీ వద్దకు వెళ్లినా పట్టించుకోలే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మానవ హక్కుల కమిషన్‍ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టీసీలో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ఐడీ, ట్రేడ్‍ యూనియన్‍ యాక్ట్ అమలు చేయట్లేదు. పెంచిన డ్యూటీలు చేయలేక ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధం అవుతున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లే. రిటైర్మెంట్‍ బెనిఫిట్స్ ఇవ్వట్లే. అడిగేవారు కరువయ్యారు.                                   - రాజిరెడ్డి, జేఏసీ జనరల్‍ సెక్రటరీ
ఆల్టర్నేటివ్​ డ్యూటీలు వేస్తున్నం
ఎక్సెస్ కండక్టర్లను ప్యాసింజర్ ​గైడ్స్​గా,  డిపోలు,  బస్​స్టేషన్ల రక్షణ డ్యూటీలు వేస్తున్నాం. పేమెంట్​ డ్యూస్​ చెల్లించక పోవడం వల్ల హైర్​ బస్సులను నడపడం లేదు. ఈ బస్సులు స్టార్ట్​ అయ్యేవరకు ఇతర సేవలకు వినియోగించుకుంటున్నాం. డ్యూటీల్లో ఏవైనా ప్రాబ్లమ్స్​ ఉన్నట్టు మా దృష్టికి వస్తే పరిష్కరిస్తం.
                                                                                                           - సుధాపరిమళ, రీజినల్​ మేనేజర్, నిజామాబాద్​
ప్రాబ్లమ్స్ ఉన్నయ్​ 
గైడ్​ డ్యూటీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీళ్లు, టాయ్​లెట్లు లేకుండా ఎనిమిది గంటల పాటు  ఎండ లో డ్యూటీ చేస్తున్నం. మహిళా ఉద్యోగు లకు ఆఫీస్​ డ్యూటీలు ఇస్తే బాగుండేది. సంస్థ కోసం కష్టమైనా డ్యూటీ చేస్తం.                      - సరోజ, మహిళా కండక్టర్, నిజామాబాద్