బంధువులు చనిపోతే ప్రూఫ్​ కోసం ఫొటోలు పంపాల్నట!

బంధువులు చనిపోతే ప్రూఫ్​ కోసం ఫొటోలు పంపాల్నట!
  •      మెదక్ ​ఆర్టీసీ డీఎం, సీఐ వేధిస్తున్నరు
  •     ఇబ్బందులు పట్టించుకోకుండా డ్యూటీలు వేస్తున్నరు 
  •     ఆర్టీసీ డ్రైవర్ల ఆరోపణ
  •     విధులు బహిష్కరించి ఆందోళన

మెదక్​టౌన్, వెలుగు : మెదక్​ఆర్టీసీ డిపోలో డీఎం, సీఐ తమ ఇబ్బందులను పట్టించుకోకుండా డ్యూటీలు వేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం డ్రైవర్లు విధులు బహిష్కరించి డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్​ఆర్టీసీ డీఎం సుధ, సీఐ వీరబాబు12 గంటలు విధులు నిర్వహించినప్పటికీ రెస్ట్​ ఇవ్వడం లేదని, టిమ్స్​ డ్రైవర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం కింద తమ సమస్యలు పరిష్కరించాలని డిపో మేనేజర్​కు నోటీస్ ఇచ్చామన్నారు. అలాగే ఇంటి వద్ద పది గంటలు కూడా ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. 

హోటల్​లో తిని డిపోలో పడుకుని డ్యూటీ చేస్తున్నామన్నారు. కుటుంబసభ్యులు, బంధువులు చనిపోతే డీఎంకు, సీఐకి సమాచారం ఇవ్వడంతోనే సరిపోదని అందుకు సంబంధించిన ఫొటోలు పంపాలని వేధిస్తున్నారన్నారు. ఈ విషయమై మెదక్​డిప్యూటీ ఆర్ఎం దైవాదీనం, డీఎం సుధను వివరణ కోరగా డిపోలోని  డ్రైవర్లకు అన్ని డిపోల మాదిరిగానే డ్యూటీలు వేస్తున్నామని, వారు చేసే ఆరోపణలు అవాస్తవమన్నారు. డ్రైవర్లతో చర్చలు జరుపుతున్నామని, శనివారం నుంచి విధుల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.