వాహన చట్టాలు రద్దు చేయాలని డ్రైవర్ల రాస్తారోకో

వాహన చట్టాలు రద్దు చేయాలని డ్రైవర్ల రాస్తారోకో

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: కేంద్రం తీసుకురానున్న హిట్​ అండ్ రన్ చట్టంలో సవరణ చేయాలని, చట్టం తెచ్చే ముందు  లా కమిషన్​ను సంప్రదించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్  డిమాండ్ చేశారు.  భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్106లోని 1,2 చట్టం రద్దు చేయాలని అబ్దుల్లాపూర్​మెట్ బాటసింగారం చౌరస్తా వద్ద బుధవారం ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. కేంద ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకుండా పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు కూడా చట్టాన్ని వ్యతిరేకించాలని కోరారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అజయ్ బాబు,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జాతర రుద్రకుమార్ అధ్యక్షత వహించగా సీఐటీయూ అబ్దుల్లాపూర్ మెట్ కన్వీనర్ సీనియర్ నేతలు నరసింహ, ప్రభాకర్  పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లాలో..

శామీర్​పేట: మేడ్చల్ జిల్లాకు చెందిన ఆల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు శామీర్ పేట మండలంలోని మజీద్​పూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కీసర ఓఆర్ఆర్ వద్ద సైతం లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు.