
మరో రెండుచోట్ల
తప్పిన ప్రమాదాలు
వేములవాడలో
ఊడిన బస్సు స్టీరింగ్
హుజురాబాద్‌లో విరిగిన జాయింట్రాడ్
మద్యం మత్తులో కారును ఢీకొట్టిన టెంపరరీ డ్రైవర్
వెలుగు నెట్వర్క్:మెయింటనెన్స్ లేక, చెకింగ్ జరగకుండానే రోడ్డెక్కుతున్న బస్సులతో ప్రమాదాలు జరుగుతుండగా.. నిర్లక్ష్యంతో బస్సు నడుపుతూ టెంపరరీ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యానికి బుధవారం రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మద్యం మత్తులో బస్సు నడుపుతూ ముందు వెళుతున్న కారును ఢీకొట్టాడో తాత్కాలిక డ్రైవర్.. ఓ చోట రన్నింగ్‌లో బస్సు జాయింట్ రాడ్ విరగగా, మరోచోట స్టీరింగ్ఊడొచ్చేసింది.
విరిగిన జాయింట్ రాడ్
బోధన్ డిపోకు చెందిన బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో కరీంనగర్‌నుంచి వరంగల్ వెళుతోంది. ఈ క్రమంలో హుజురాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బస్సు జాయింట్ రాడ్ విరిగిపోయింది. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును ఆపేశాడు. దీంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సు నెమ్మదిగా వెళుతుంది కాబట్టి ప్రమాదం తప్పిందని, అదే వేగంగా వెళుతుంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు. పోలీసులు వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. మరో ఘటనలో.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వద్ద కరీంనగర్ డిపోకు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. నాంపల్లి మూలమలుపు వద్ద స్టీరింగ్ ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశారు.
కరీంనగర్ నుంచి వేములవాడ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్ చెప్పారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వివరించారు. మద్యం మత్తులో బస్సు నడిపి కారును ఢీ కొట్టాడో తాత్కాలిక డ్రైవర్.. సిద్దిపేట డిపోకు చెందిన బస్సు కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళుతుండగా రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్యామేజ్ కావడంతో యజమాని, స్థానికులు బస్సు డ్రైవర్ నరేశ్‌ను నిలదీశారు. ఈ క్రమంలో డ్రైవర్ దగ్గరి నుంచి మద్యం వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బస్సు ఢీ కొని ఇద్దరు మృతి
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంబర్పేట్ ఛే నంబర్ బస్టాప్దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న ఘన్ శ్యాం(42)ను బస్సు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఘన్‌శ్యాం అక్కడికక్కడే చనిపోయాడు. కాచిగూడ డిపోకు చెందిన ఈ బస్సును టెంపరరీ డ్రైవర్ ఎ.మురళీకృష్ణ నడిపాడని అధికారులు గుర్తించారు. నిజామాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. నందిపేట్నుంచి నిజామాబాద్ వస్తున్న ఈ బస్సును తాత్కాలిక డ్రైవర్ కరీస్ కుమార్ నడిపాడు. నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ జరిగిందని, ప్రమాదానికి కారణమైన టెంపరరీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.