
లండన్: అమెరికా స్టార్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ తొలిసారి వింబుల్డన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్ ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (4)తో కారెన్ కచనోవ్ (రష్యా)పై గెలిచాడు. రెండు గంటలా 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అమెరికన్ స్టార్టింగ్‌లో అద్భుతంగా ఆడినా.. తర్వాత కొద్దిగా ఇబ్బందిపడ్డాడు. మూడు, నాలుగో సెట్ ఆరంభంలో కచనోవ్ సర్వీస్‌లను ఎదుర్కోవడంలో తడబడ్డాడు.
అయినా కోలుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 16 ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన ఫ్రిట్జ్ ఎనిమిది బ్రేక్ పాయింట్లలో మూడింటినే కాపాడుకున్నాడు. 47 విన్నర్లతో పాటు 31 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడటంలో విఫలమైన కచనోవ్ 6 ఏస్‌లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. నాలుగు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకున్నా ప్రయోజనం దక్కలేదు. 35 విన్నర్లు, 38 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు.
మరో మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–3, 6–3తో కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. బలమైన సర్వీస్‌లు, క్రాస్ కోర్టు విన్నర్లతో చెలరేగిన కార్లోస్ గంటా 39 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 13 ఏస్‌లు కొట్టగా, నోరి మూడుకే పరిమితమయ్యాడు. 11 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాపాడుకుని 39 విన్నర్లతో మ్యాచ్‌ను సాధించాడు.
తన సర్వీస్‌లో 89 శాతం పాయింట్లు సాధించిన అల్కరాజ్ 26 అన్ ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. నోరి ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించలేకపోయాడు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 4–6, 6–2, 6–4తో లారా సీజ్మండ్ (జర్మనీ)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. దాదాపు మూడు గంటలు సాగిన మ్యాచ్‌లో సబలెంక తొలి సెట్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుంది.
కోర్టులో చురుకుగా కదులుతూ అటాకింగ్ గేమ్ ఆడింది. రెండు ఏస్‌లు, నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసిన ఆమె 13 బ్రేక్ పాయింట్లలో ఎనిమిదింటిని కాచుకుంది. 29 విన్నర్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ అమండా అన్సిమోవా (అమెరికా) 6–1, 7–6 (11/9)తో అనస్తాసియా పవ్లుచెంకోవా (రష్యా)పై నెగ్గింది.