కారు చలాన్ పేరుతో సైబర్ మోసం .. బాధితుడు ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్

కారు చలాన్ పేరుతో సైబర్ మోసం .. బాధితుడు ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్

బషీర్​బాగ్, వెలుగు: కారు చలాన్​పెండింగ్​ఉందంటూ సైబర్​నేరగాళ్లు  ఓ ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి రూ.1.20 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ వాట్సాప్ కు స్కామర్స్​e-parivahan.apk ఫైల్ పంపించారు. మీ కారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిందని, రూ.1,000  ఫైన్ కట్టాలని సూచించారు. అది నిజమని నమ్మిన ఆయన ఏపీకే ఫైల్ క్లిక్​చేశారు. కాసేపటికే తన ఎస్​బీఐ క్రెడిట్ కార్డు నుంచి రెండు దఫాలుగా రూ.1,20,409 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.

మరో కేసులో ప్రైవేట్​ ఉద్యోగి నుంచి..

ఏపీకే ఫైల్ ను క్లిక్​చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి మూడు రోజుల్లో రూ.1.38 లక్షలు పోగొట్టుకున్నాడు.  సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ కు చెందిన సురేశ్ ప్రైవేట్ ఉద్యోగి. గత నెల 22న వాట్సాప్ గ్రూప్ లో ఎం కిసాన్ యోజన పేరిట వచ్చిన ఏపీకే ఫైల్ ను అతను క్లిక్​చేశాడు. ఆరోజు నుంచి వరుసగా మూడు రోజులు సురేశ్​అకౌంట్​నుంచి రూ.1,38,800 డెబిట్​అయ్యాయి. అంతటితో ఆగని స్కామర్స్ అతని సిమ్ కార్డు ను క్లోనింగ్ చేశారు. ఆ సిమ్ ను ఆపరేట్ చేస్తూ అతని కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూపులకు ఏపీకే ఫైల్ పంపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.