
బెంగుళూర్: కర్నాటక సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతోన్న వారికి చెక్ పెట్టేందుకు ప్రైవేట్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు లైసెన్సింగ్ విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల యూట్యూబ్‌లో ఊరు పేరు లేకుండా వందల కొద్ది ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి.
యూట్యూబ్ న్యూస్ ఛానల్ పేరుతో కొందరు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు తదితరుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల మొత్తం జర్నలిజానికే చెడ్డపేరు వస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల అక్రమాలను అరికట్టాలని ఎలక్ట్రానిక్ మీడియా సీఎం సిద్ధరామయ్యను కోరింది.
ఈ మేరకు సీఎంకు వినతి పత్రం అందజేసింది. టీవీ న్యూస్ ఛానళ్ల మాదిరిగానే ప్రైవేట్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరింది. జర్నలిజం ముసుగులో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు సమాజానికి ప్రమాదమని.. వీటిని అరికట్టడానికి టీవీ ఛానళ్ల తరహాలో లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా కోరింది. ఎలక్ట్రానిక్ మీడియా అభ్యర్థనపై సీఎం సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు.
ఎలక్ట్రానిక్ మీడియా డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. మీడియా జనానికి నిజాలు చూపించి.. ఉన్నది ఉన్నట్లుగా రాయలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా డిమాండ్ పట్ల సీఎం సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించడంతో కర్ణాటక ప్రభుత్వం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్‌కు లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల పేరుతో దందాలకు పాల్పడుతోన్న వారికి బిగ్ షాక్ తగిలినట్లైతుంది.