
నిబంధనలకు విరుద్ధంగా వెహికల్స్ నడిపితే ఆర్టీఏ అధికారులు లైసెన్సులు రద్దు చేస్తున్నారు. 2015 నుంచి ఇప్పటిదాకా 13,971 లైసెన్సులు రద్దు చేశారు. ఇందులో ఎక్కువగా ఓవర్ లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, గూడ్స్ వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోవడం తదితర కారణాలతో వేల సంఖ్యలో రద్దు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆర్టీఏ అధికారులు నేరుగా రద్దు చేస్తుండగా, మరికొన్నిసార్లు కోర్టు ఆదేశాలు, ట్రాఫిక్ అధికారుల సూచన మేరకు రద్దు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 2,117
2016–17లో అత్యధికంగా 5,460 లైసెన్స్‌లు క్యాన్సిల్ అయ్యాయి. ఐదేళ్లలో అత్యధికంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నారన్న కారణంతో 2,532 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. ఆ తర్వాత డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 2,117 క్యాన్సిల్ చేయగా, యాక్సిడెంట్‌లో 1,661, కోర్టు కేసుల్లో 908, సెల్‌ఫోన్‌డ్రైవింగ్ లో 720 మంది, ఇతర కారణాలతో 5,313 మంది లైసెన్స్‌లు క్యాన్సిల్ అయ్యాయి.
12 పాయింట్లు దాటారంటే..
గతంలో పాయింట్ల విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం.. నేరాన్ని బట్టి ఒక పాయింట్ నుంచి 5 పాయింట్ల వరకు విధిస్తోంది. డ్రంకన్ డ్రైవ్‌కు 3 నుంచి 5, ఓవర్ స్పీడ్‌కు 3 పాయింట్లు వేస్తున్నారు. 12 పాయింట్లు దాటితే మూడు నెలల నుంచి ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్లపాటు రద్దు, మూడోసారి అయితే మూడేళ్లపాటు రద్దు చేస్తున్నారు. లైసెన్స్ రద్దు చేశాక వాహనం నడిపితే మూడు నెలలు జైలు శిక్ష, బండి సీజ్ చేసి, చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. లైసెన్స్ రద్దయ్యాక తిరిగి పొందడానికి 3 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.