- రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు పరిశీలించిన డీఆర్ఎం గోపాల కృష్ణన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల కృష్ణన్ మంగళవారం పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న పనుల దృష్ట్యా ప్లాట్‌ఫామ్ 1 వైపు పార్కింగ్ నిలిపివేశారు. ఇక్కడ పికప్, డ్రాప్ మాత్రమే అనుమతిస్తున్నారు. బదులుగా ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు (బోయిగూడ వైపు) అన్ని సౌకర్యాలు కల్పించి బేస్మెంట్-1లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్లాట్‌ఫామ్ 1 వైపు గేట్-2, గేట్-4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలు, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5ఏ తెరిచారు. మెయిన్ టెర్మినల్స్‌లో రద్దీ తగ్గించడానికి ముఖ్యమైన 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
రైళ్లలో మండే వస్తువులు వద్దు
పద్మారావునగర్: రైళ్లలో మండే వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లవద్దని ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు ప్రయాణికులను కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మంగళవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప భక్తులు రైళ్లలో అగరబత్తీలు, ధూపం వెలిగించవద్దని ప్రత్యేకంగా సూచించారు. డాగ్ స్క్వాడ్ ‘బ్లేజ్’ సహాయంతో ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో అనుమానాస్పద వస్తువుల తనిఖీలు నిర్వహించారు.
