ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. రూ.4.10 కోట్లతో నిర్మించనున్న ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయ భవనానికి శుంకుస్థాపన, భూగర్భ డ్రైనేజీ పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఆమనగల్లుకు 360 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అవి పూర్తయితే మరో 360 ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
డీ లిమిటేషన్ పూర్తయిన వెంటనే అన్ని డివిజినల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంపీడీవో కుసుమ మాధురి, తహసీల్దార్ మహమ్మద్ ఫయీమ్ ఖాద్రీ హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే పిలిపించారు. అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటని కమిషనర్ శంకర్ పైనా అసహనం వ్యక్తం చేశారు.
తీరు మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, యాట నరసింహ, జగన్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
