యూఏఈ రాజధాని అబుదాబి సిటీ అల్ దఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారని యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది. అయితే రేడియేషన్ ముప్పు లేదని ప్రకటించింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఓ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. యూఏఈ రాజధాని అబుదాబి సిటీ అల్ దఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ ప్లాంట్‌పై ఆదివారం ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి కారణంగా ప్లాంట్ లో మంటలు చెలరేగాయని, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారని యూఏఈ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలపై ఎటువంటి ప్రభావం పడలేదని తెలిపింది.
డ్రోన్ దాడి వల్ల బరాకా అణు విద్యుత్ ప్లాంట్ వద్ద ఉన్న ఒక ఎలక్ట్రికల్ జనరేటర్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొంది. మంటల వల్ల విద్యుత్ ప్లాంట్ భద్రతకు గానీ, దాని అత్యవసర వ్యవస్థలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (ఎఫ్ఏఎన్ఆర్) కూడా ధృవీకరించింది. ప్లాంట్ లోని అన్ని యూనిట్లు యథావిధిగా పనిచేస్తూ ఉన్నాయని తెలిపింది. కాగా, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మొదలయినప్పటి నుంచీ అమెరికా మిత్రదేశాలుగా ఉన్న యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ డ్రోన్, మిసైల్ దాడులు చేస్తోంది.
ఇప్పటివరకు పశ్చిమాసియాలో గల్ఫ్ అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాదాపు 3,000 క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ తరచుగా డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
