భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి

భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి
  •     గుజరాత్ తీరంలో నౌకను ఢీకొన్న డ్రోన్
  •     నౌకలోని 20 మంది సిబ్బంది సేఫ్.. 
  •     దెబ్బతిన్న ‘ఎంవీ కెమ్ ఫ్లూటో’

న్యూఢిల్లీ: అరేబియా సముద్రం గుండా ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన గుజరాత్‌‌ తీరంలో చోటు చేసుకుంది. పోరుబందర్‌‌ తీరానికి 401 కిలో మీటర్ల దూరంలో జరిగిన ఈ అటాక్​లో.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని నేవీ అధికారులు ప్రకటించారు. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్.. ‘ఎంవీ కెమ్ ఫ్లూటో’ మర్చంట్ షిష్​ను ఢీకొట్టినట్టు అనుమానిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయన్నారు. డ్రోన్ దాడి జరిగిన సమయంలో షిప్​లో 20 మంది ఇండియన్ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. షిప్ ఇండియావైపు వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని వివరించారు. సౌదీ అరేబియా నుంచి లైబీరియా జెండాతో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో బయలుదేరిన ఎంవీ కెమ్ ఫ్లూటో షిప్.. మంగళూరు వైపు వెళ్తున్నది. ఈ షిప్.. ఇజ్రాయెల్‌‌ అనుబంధ సంస్థకు చెందినది.

దర్యాప్తు చేస్తున్న నేవీ అధికారులు

డ్రోన్ దాడి విషయాన్ని షిప్​లో ఉన్న సిబ్బంది కోస్టల్ గార్డ్స్​కు వివరించారు. దీంతో ఇండియన్ ఎక్స్​క్లూజివ్ ఎకనామిక్ జోన్​లో పెట్రోలింగ్ చేస్తున్న కోస్ట్ గార్డ్ షిప్, ఐసీజీఎస్ విక్రమ్​ను నేవీ అధికారులు రంగంలోకి దించారు. కొన్ని నిమిషాల్లోనే నౌకలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కోస్ట్ గార్డ్ షిప్ మిగిలిన నౌకలను కూడా అలర్ట్ చేసిందని నేవీ అధికారులు స్పష్టం చేశారు. పేలుడు కారణంగా షిప్ కొంత భాగం దెబ్బతిన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ షిప్ వేగంగా మంటలు అదుపులో తీసుకొచ్చిందని వివరించారు. దెబ్బతిన్న ఎంవీ కెమ్ ఫ్లూటో షిప్​ను సేఫ్​గా తీరానికి తీసుకొచ్చేందుకు వార్ షిప్​లను పంపిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికితోడు ఏ ఆర్గనైజేషన్ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదని నేవీ అధికారులు తెలిపారు. అయినా, డ్రోన్ దాడిపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్‌‌ మద్దతున్న యెమెన్‌‌లోని 
హౌతీ రెబల్స్‌‌.. వాణిజ్య నౌకలపై దాడులు చేశారు.