- కొత్తగూడెంలో రూ.20 కోట్లకు పైగా విలువైన 44.28 ఎకరాల ల్యాండ్ స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమవగా, వాటిని స్వాధీనం చేసుకునేందుకు సంస్థ చర్యలు ప్రారంభించింది. కంపెనీ భూముల రక్షణ కోసం ఎస్టేట్ విభాగం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కంపెనీ ల్యాండ్స్‌పై డ్రోన్స్ సర్వే చేపట్టారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణికి చెందిన స్థలాలు ఆఫీసర్ల నిర్లక్ష్యం, కమీషన్ల కారణంగా ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ నాయకుల జోక్యంతో ఆక్రమణలు మరింతగా పెరిగాయి.
కొత్తగూడెం ఏరియాతో పాటు కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోదావరిఖని, గోలేటి, ఆర్జీ1, 2, 3 ఏరియాలతో పాటు సింగరేణి ప్రాంతాల్లో కంపెనీ ల్యాండ్ ఎంత? గవర్నమెంట్‌కు ఎంత సరెండర్ చేశారు? ఎంత భూమి ఆక్రమణకు గురైంది? అనే అంశంపై గెజిట్ రికార్డుల ఆధారంగా ఎస్టేట్ డిపార్ట్మెంట్ డ్రోన్లతో సర్వే చేపట్టింది. సింగరేణి చరిత్రలోనే మొదటిసారి యాజమాన్యం డ్రోన్లతో ల్యాండ్స్‌పై సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు.
కొత్తగూడెంలో విలువైన భూములు స్వాధీనం
సింగరేణి హెడ్ ఆఫీస్ ఉన్న కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాల్లో కంపెనీ ల్యాండ్స్ ఆక్రమణపై ఎస్టేట్ విభాగం సర్వేను ముమ్మరం చేసింది. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ పరిసర ప్రాంతాల్లో 45 ఎకరాల సింగరేణి స్థలాలు కబ్జాకు గురైనట్లు ఎస్టేట్ అధికారులు గుర్తించారు.
తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో ఫీల్డ్‌లోకి వెళ్లి రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో సర్వే చేశారు. ఈక్రమంలో 44.90 ఎకరాల భూమిని సర్వే చేసి, మూడు దశాబ్దాలుగా ఆక్రమణకు గురైన సింగరేణి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సగం భూములు చేతులు మారినట్లు గుర్తించారు.
ఈ చర్యతో భూములు కొన్నవాళ్లు తలలు పట్టుకుంటున్నారు. వీటి విలువ దాదాపు రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. హైవేకు సమీపంలో మరో ఎకరం భూమిని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఆక్రమించుకుంది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని పాత పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రూ. 25 లక్షల విలువైన సింగరేణి స్థలాన్ని ప్రముఖ వ్యాపారి ఆక్రమించుకున్నాడు.
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న విలువైన స్థలాన్ని ఓ ప్రముఖ వ్యాపారి ఆక్రమించుకోవడంతో పాటు నిర్మాణాలు చేపట్టాడు. మెయిన్ హాస్పిటల్ ఏరియాతో పాటు బాబు క్యాంప్, బర్మా క్యాంప్, రామవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కంపెనీ ల్యాండ్స్ అన్యాక్రాంతమైనట్లు చెబుతున్నారు.
గోదావరిఖని, ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి..
గోదావరిఖని ఏరియాలో కబ్జాకు గురైన కోట్లు విలువ చేసే ల్యాండ్‌ను కాపాడేందుకు ఎస్టేట్ విభాగం చర్యలు చేపట్టింది. గోదావరిఖని మెయిన్ రోడ్డులోని అర ఎకరం ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు ప్రారంభించింది.
ఇల్లెందు ఏరియాలో జేకే ఓసీ ఓబీ డంప్‌యార్డ్ సమీపంలో సింగరేణి భూములను కొందరు దళారులు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇల్లెందు ఏరియాలో 20 నుంచి 35 ఎకరాల సింగరేణి భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
