హైదరాబాద్ –విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్ కు డ్రోన్లు

హైదరాబాద్ –విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్ కు డ్రోన్లు
  •     సంక్రాంతి రద్దీ నేపథ్యంలో పోలీస్ శాఖ నిర్ణయం
  •     కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి మానిటరింగ్
  •     పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు

నల్గొండ/చౌటుప్పల్, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమబద్ధీకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా రోజుకు ఈ హైవేపై 25 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సంక్రాంతి టైమ్​లో ఆ సంఖ్య 60 వేల నుంచి లక్ష వాహనాలకు పైగా ఉంటుంది. 

ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్​లు, రోడ్ సేఫ్టీ, స్పీడ్ బ్రేకర్లు, 24/7 రహదారి పర్యవేక్షణ, పోలీస్ పికెట్లు సెటప్ చేస్తున్నారు. ఈ సారి ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నారు.

డ్రోన్ల హెల్ప్​తో ఎప్పటికప్పుడు సమాచారం

హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ జామ్ అయినా.. కమాండ్ కంట్రోల్ కి సమాచారం అందేలా డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ప్రజలు సేఫ్​గా గమ్య స్థానాలు చేరేలా భద్రతా చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్లే ఎన్ హెచ్ 65 రహదారిపై 24 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో పోలీస్ సిబ్బంది, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు డ్రోన్లను రంగంలోకి దించుతారు. 

పండుగకు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రస్తుతం గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ వైపు వెళ్లే వాహనాలు నార్కెట్​పల్లి మీదుగా, రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్, టేకుమట్ల వద్ద దారి మళ్లించనున్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బందితో పోలీస్ పికెట్లు, పోలీస్ పెట్రోలింగ్, క్రేన్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు పర్యవేక్షించేలా డ్రోన్లు ఏర్పాట్లు చేస్తారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలకు వెంటనే పోలీస్ సిబ్బంది చేరుకుని క్లియర్ చేస్తారు.

16 టోల్ బూత్​లు

శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడం, అటు సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు వీకెండ్ కలిసి రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం భారీగా వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ వసూలు బూత్ ఉండగా విజయవాడ వైపు 8 టోల్ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఓపెన్ చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.