శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల కలకలం

శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల కలకలం
  • 4 రోజులుగా అర్ధరాత్రి చక్కర్లు..
  • ఇంతకూ శ్రీశైలంలో ఏం జరుగుతోంది?

కర్నూలు: భూ కైలాస క్షేత్రం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం శ్రీశైలంలో అర్ధరాత్రిపూట డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా శైవక్షేత్రం శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్లు సంచరిస్తున్నట్లు గుర్తించిన దేవాలయ, డ్యాం భద్రతా విభాగం వారు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు  కలకలం రేపుతున్నాయి. 
నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్లు శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లో ఆకాశవీధుల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శ్రీశైలం జలాశయం నీరు కేంద్ర బిందువుగా మారిన నేపధ్యంలో డ్రోన్లు ఎవరు ఎగురవేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తరపున ఎవరైనా ప్రయత్నిస్తున్నారా.. లేక ఉగ్రవాదులు రెక్కీ నిర్వహిస్తున్నారా.. లేక ఆకతాయిలు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారా అన్న ప్రచారాలు గందరగోళం రేపుతున్నాయి. 
కొంత మంది చెబుతున్నది నిజమే అయితే రాత్రివేళల్లో డ్రోన్లు తిరగడం అనుమానాలురేకెత్తిస్తోంది. 
ఒకవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లో  ఉగ్రవాదుల కదలికలు.. బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది అక్రమంగా దేశంలో చొరబడి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో పట్టుపడడం తదితర ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మకాం వేశారా? లేక గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ముఠా పని అయి ఉంటుందా? అనే అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి.

డ్రోన్లు తిరుగుతున్న సమయంలో వెంటనే గుర్తించి పట్టుకునేందుకు దేవస్థానం భద్రతా సిబ్బంది ప్రయత్నించినా దొరకలేదు. ఆకాశంలో బాగా ఎత్తుగా.. వేగంగా ఎగిరిపోతుండడంతో పట్టుకోవడం స్థానిక పోలీసులకు సవాల్ గా మారింది. గతంలో శ్రీశైలం ఆలయానికి ముంపు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.