బీసీల కోసం పోటీ నుంచి తప్పుకుంటున్న : డీకే అరుణ

బీసీల కోసం పోటీ నుంచి తప్పుకుంటున్న : డీకే అరుణ
  • వాల్మీకి బోయలకు ఇవ్వాలని బీజేపీ లీడర్లతో కలిసి తీర్మానం

గద్వాల, వెలుగు: గద్వాల బీజేపీలో ఆదివారం అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో బీసీలకు టికెట్​ఇచ్చేందుకు వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు డీకే అరుణ ప్రకటించారు. తర్వాత మెజార్టీ లీడర్లు బీసీల్లోని వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ సమక్షంలో తీర్మానం చేసి హైకమాండ్​కు పంపించారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని డీకే అరుణ నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఈసారి గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు డీకే అరుణ ప్రకటించారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీసీ నినాదంతో ముందుకుపోతున్నందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. గద్వాల నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న వాల్మీకి బోయలకు టికెట్ ఇస్తే పార్టీకి ఇమేజ్ తో పాటు నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని లీడర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ నినాదంతో కుర్వ సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్​పర్సన్ సరితకు టికెట్ కేటాయించిందని, బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చారని గుర్తు చేశారు.