సర్కారు బడులకు ప్రచారం కరువు

సర్కారు బడులకు ప్రచారం కరువు

మరో వారం రోజుల్లో బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్ల ప్రచార జోరు కొనసాగుతుండగా, సర్కారు బడులకు మాత్రం ప్రచారం కరువైంది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా కరపత్రాలు, బ్యానర్లతో కార్పొరేట్‌ బడులు తమ క్యాన్వాసింగ్‌ను హోరెత్తిస్తున్నాయి.  అయితే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు మాత్రం స్కూళ్లు రీఓపెన్‌ అయ్యాకే ప్రచారం నిర్వహిస్తామని విద్యాశాఖ భీష్మించుకు కూర్చుంది. బడిబాట సందర్భంగానే ప్రచారం నిర్వహిస్తామని చెప్తోంది. అయితే అప్పటికే మెజార్టీ స్టూడెంట్స్‌ వేర్వేరు బడుల్లో చేరిపోతారు. ఆ సమయంలో బడిబాట చేసినా ఏం ఉపయోగం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. జూన్‌12న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు అధికారికంగా రీఓపెన్‌ కానున్నాయి. జూన్‌1 నుంచే బడులు ప్రారంభిస్తామని గతంలో చెప్పినా, ఎండల నేపథ్యంలో జూన్‌ 11 వరకు సెలవులు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 42 వేల స్కూళ్లుండగా, వాటిలో 11వేల వరకూ ప్రైవేటు, కార్పొరేట్‌ బడులున్నాయి. మిగిలినవి సర్కారు ఆధీనంలో నడిచే పాఠశాలలు. అయితే ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లో స్టూడెంట్స్‌ను చేర్పించుకునేందుకు యాజమాన్యాలు జనవరి నుంచే క్యాంపెయిన్‌ ప్రారంభించాయి. ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకున్న వారికి ఫీజులో కొంత రాయితీ ప్రకటించాయి. దీంతో చాలామంది పేరెంట్స్‌ వారు కోరుకున్న స్కూళ్లలో సీట్లు దొరకవనే భావనతో ముందే ఫీజు చెల్లించి రిజర్వ్ చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ మైనార్టీ విద్యాసంస్థలో ప్రవేశాల కోసం అడ్మిషన్‌ ఫారాలు ఇస్తున్నారనే ప్రకటనతో తెల్లవారుజాము నుంచే పేరెంట్స్‌ ఆ స్కూల్‌ ముందు క్యూలైన్లు కట్టారు. ఆ సంస్థ ఆధీనంలోని రెండు స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లు  స్కాలర్‌షిప్‌ టెస్టుల పేరుతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే విద్యార్థులను ఆకర్షించాయి. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం అలాంటి పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్టేట్‌లోని ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు ఆయా బడుల్లో పనిచేసే టీచర్లతో పాటు కొంతమంది పీఆర్‌ఓలను నియమించుకుని స్టూడెంట్ల ఆడ్మిషన్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

సర్కారీలో జూన్‌ 14 నుంచే ప్రచారం

స్కూల్​విద్యాశాఖ ఆధీనంలో సుమారు 25 వేల స్కూళ్లున్నాయి. అయితే వాటిలో ప్రచారమేమీ కనిపించడం లేదు. జూన్‌ 1 నుంచి బడులు ప్రారంభిస్తే 4 నుంచి బడిబాట నిర్వహించాలని భావించారు. మారిన షెడ్యూల్‌ నేపథ్యంలో జూన్‌14 నుంచి బడిబాట ప్రారంభం కానున్నది. అయితే అప్పటివరకు స్టూడెంట్లు ఏ బడిలోనూ చేరకుండా ఉంటారా.. అనేది అనుమానమే. ఇప్పటికే సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లను ప్రైవేటు వైపు తిప్పుకునేందుకు మేనేజ్మెంట్లు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బడులు ప్రారంభమైన తర్వాత రెండు రోజులకు బడిబాట నిర్వహించడంతో ఎలాంటి ఉపయోగం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే స్టేట్‌లో కులాలవారీగా గురుకులాల సంఖ్య పెరుగుతున్నకొద్ది, సర్కారీ బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోంది. గతేడాది పదిలోపు స్టూడెంట్లున్న బడులు సుమారు మూడువేలకు పైగానే ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. అయినా స్కూల్​ విద్యాశాఖ మాత్రం మేల్కొనడం లేదు. అయితే కొన్ని సర్కారీ బడుల్లోని టీచర్లు మాత్రం స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కనీసం వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా మేల్కొంటారా..?

జూన్‌ 14 నుంచి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ఒక్కో స్కూల్‌కు రూ. వెయ్యి కేటాయించింది. దీంతో బ్యానర్లు, కరపత్రాలు, బడిని అందంగా తీర్చిదిద్దడం, ర్యాలీలు నిర్వహించడం, సామూహిక అక్షరాభ్యాసం, స్టూడెంట్స్‌, పేరెంట్స్‌ సన్మానం, పేరెంట్స్‌ మీటింగ్‌… ఇవన్నీ నిర్వహించాలని సూచించింది. అయితే ఈ డబ్బులు కేవలం బ్యానర్లకు కూడా సరిపోవనే విమర్శలు వస్తున్నాయి. ఏదో నామమాత్రంగా బడిబాట నిర్వహించామా అంటే నిర్వహించాం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే వాదనలూ ఉన్నాయి. బడిబాటకు కనీసం రూ. పది వేలు కేటాయించాలని టీచర్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు టీచర్స్‌ యూనియన్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించి, జూన్‌ మొదటివారంలో బడిబాట నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.