ద్రాక్ష రైతులకు కరువైన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం

ద్రాక్ష రైతులకు కరువైన రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం

రాష్ట్రంలో 15 వేల నుంచి 754 ఎకరాలకు పడిపోయిన తోటలు
ఏటా 20,462 టన్నుల కొరత గ్రేప్స్ సాగుపై అగ్రికల్చర్ వర్సిటీ సర్వే 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ద్రాక్ష తోటలు కనుమరుగు అవుతున్నయి. గ్రేటర్‌‌ శివార్లలో ఒకప్పుడు ఎటు చూసినా గ్రేప్ గార్డెన్లు కనిపించేవి. ఇప్పుడు అక్కడక్కడ, అది కూడా కొన్ని ఎకరాల్లోనే గ్రేప్స్ సాగు చేస్తున్నారు. స్టేట్ లో ద్రాక్ష పండ్లు తినేటోళ్ల సంఖ్య ఏటా పెరుగుతున్నా.. వీటి సాగు మాత్రం వేల ఎకరాల నుంచి వందల ఎకరాలకు పడిపోయింది. గతంలో రాష్ట్రంలో 15 వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు సాగు ఉండేది.ఇప్పుడు వీటి సాగు 754 ఎకరాలకు పడిపోయిందని ఇటీవల ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. స్టేట్ లో ద్రాక్ష పండ్ల డిమాండ్, వినియోగం, సాగు, దిగుమతుల వంటి అంశాలపై సర్వే చేసిన అగ్రికల్చర్ వర్సిటీ ఆ వివరాలను ప్రకటించింది. ద్రాక్ష సాగును ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఒక్కొక్కరు ఏటా 2 కిలోలు..

రాష్ట్రంలో రోజువారీగా ద్రాక్ష పండ్ల తలసరి వినియోగం 5.33 గ్రాములు ఉంటోంది. నెలకు ఒక్కొక్కరు 0.16 కేజీలు.. ఏడాదికి1.92 కేజీల మేరకు గ్రేప్స్ తింటున్నట్లు అగ్రికల్చర్ వర్సిటీ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని సగం జనాభా.. అంటే దాదాపు1.65 కోట్ల మంది ఏటా 31,772 టన్నుల ద్రాక్ష పండ్లు తింటున్నట్లు తేలింది. అయితే ఇక్కడ పండుతున్న ద్రాక్షతో 35.59 శాతం మాత్రమే అవసరాలు తీరుతున్నాయి. ఏటా 20,462 టన్నుల గ్రేప్స్ కొరత ఉంటోంది. ఇక రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి యావరేజ్ గా ఏడాదికి గ్రేప్స్ కొనుగోలు కోసం రూ. 182.76 ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏటా రూ. 302.43 కోట్లను గ్రేప్స్‌ కోసం ఖర్చు పెడుతున్నారని సర్వేలో తేలింది. గ్రేప్‌‌ గార్డెన్లు కనుమరుగు

రాష్ట్రంలో ఒకప్పుడు దాదాపు15 వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు సాగు అయ్యేవి. ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలో గజ్వేల్‌‌, ములుగు, వర్గల్‌‌, తూప్రాన్‌‌తో పాటు కీసర, మేడ్చల్‌‌, ఘట్‌‌కేసర్‌‌, శామీర్‌‌పేట్‌‌, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్‌‌, పాలమాకుల, ఫరూక్‌‌నగర్‌‌, వంటిమామిడి, తునికిబొల్లారం, తునికి ఖల్స, తుర్కపల్లి వంటి ప్రాంతాల్లో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవి. తాజ్ ఏ గణేశ్, బ్లాక్, థామ్సన్ సీడ్ లెస్ వంటి రకాలను విదేశాలకు కూడా ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లు. గజ్వేల్ నుంచి కర్నాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి జరిగేది. అయితే ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, తూప్రాన్ మండలాల్లో 2008లో వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు కాగా.. 2010 నాటికి సాగు విస్తీర్ణం150 ఎకరాలకు పడిపోయింది. 2012లో 50 ఎకరాలు మాత్రమే సాగు అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 754 ఎకరాల్లోనే ద్రాక్ష సాగవుతోందని సర్వేలో తేలింది. గ్రేప్స్ కొరత అధిగమించాలంటే మరో 2,118 ఎకరాల్లో ద్రాక్ష సాగు కావాలని అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే సాగయ్యే ఈ పంటపై ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ద్రాక్ష సాగు త్వరలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

మహారాష్ట్రలో మస్తు సపోర్ట్

గ్రేప్స్ సాగుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది. కొత్తగా ద్రాక్ష సాగు చేపట్టే రైతులకు బ్యాంక్ లోన్ తోపాటు ఫంగీసైడ్స్, పెస్టిసైడ్స్, ఆధునిక పరికరాలు, పందిరి వైరు, డ్రిప్ తదితర సౌకర్యాలు అందిస్తోంది. ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోతే ఎకరాకు రూ.80 వేల పరిహారం ఇస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తోంది. బ్యాంకుల్లో పంట రుణాలను రెన్యువల్ చేస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా సర్కారు పట్టించుకోవట్దు. గ్రేప్స్ సాగు చేసే రైతులకు ఎలాంటి ప్రత్యేక సాయం అందడం లేదు.