
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2025, జూలై 21 నుంచి 2025, ఆగస్ట్ 21 వరకు పార్లమెంట్ మూన్సూన్ సెషన్ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం (జూలై 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు, మెరుగైన భద్రతా చర్యల కారణంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు ఉండవని వెల్లడించింది.
ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వర్షకాల లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల నిర్వహణకు భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.2025 జూలై 21 నుంచి 2025, ఆగస్టు 21వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలలో ఉభయ సభలకు సెలవు ఉంటుందని చెప్పారు.
►ALSO READ | రక్తాలు పారుతాయన్న భుట్టోకి బుద్ధి వచ్చింది: ఉగ్రవాద నిర్మూలన ముందుకు రావాలని భారత్కు పిలుపు
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగబోతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవే. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాలపై వాడీ వేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది.
అలాగే.. భారత్, పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న అంశంపై కూడా హాట్ డిస్కషన్ జరగొచ్చు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ టాపిక్ కూడా ఈ సెషన్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.