
- BCCI ని కోరిన దేశవాళీ క్రికెట్ జట్ల కెప్టెన్లు, కోచ్‌లు
అన్ని అనుకున్నట్టుగా జరిగితే దేశవాళీ క్రికెట్‌లో ఊహించని మార్పులు చూసే అవకాశం కనిపిస్తుంది. టాస్ వేయకుండా మ్యాచ్ ప్రారంభం కావొచ్చు. రంజీ మ్యాచ్‌ల్లో డీఆర్‌ఎస్ విధానాన్ని చూడొచ్చు. దేశవాళీ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ప్రతీ ఏటా ఆయా జట్ల కెప్టెన్లు, కోచ్‌లతో కాన్‌క్లేవ్ నిర్వహిస్తోంది. మహిళల క్రికెట్ పురోగతి కోసం తొలిసారిగా అన్ని రాష్ట్రాలకు చెందిన విమెన్స్ జట్ల కెప్టెన్‌లు, కోచ్‌లను కూడా ఆహ్వానించింది. అయితే శుక్రవారం ముంబైలో జరిగిన ఈ కాన్‌క్లేవ్‌లో కెప్టెన్లు, కోచ్‌లు బీసీసీఐ ముందు రెండు కీలక ప్రతిపాదనలు ఉంచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వినియోగిస్తున్న డీఆర్‌ఎస్ విధానాన్ని రంజీ ట్రోఫీలో కూడా అమలు చేయడం మొదటిది కాగా, కాయిన్ టాస్ విధానానికి స్వస్తి పలకడం రెండోది.
రంజీల్లోనైనా డీఆర్‌ఎస్ పెట్టండి..
దేశవాళీల్లో డీఆర్‌ఎస్ విధానం అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే గత రంజీ సీజన్‌లో అంపైర్లు తప్పిదాలతో చాలా మ్యాచ్‌లు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో బతికిపోయిన చటేశ్వర పుజారా సెంచరీ చేశాడు. అది మ్యాచ్ ఫలితంపై చాలా ప్రభావం చూపింది. దీంతో కెప్టెన్లు, కోచ్‌లు డీఆర్‌ఎస్ అంశాన్ని బోర్డు దృష్టికి తెచ్చి ఆవశ్యకతను వివరించారు. ప్రస్తుతం కొత్త జట్లు చేరికతో మ్యాచ్‌ల సంఖ్య పెరగడంతో డీఆర్‌ఎస్ అమలు అనివార్యమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో రంజీ మ్యాచ్‌ల వరకు డీఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
టాస్ వద్దు..
మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగే కాయిన్ టాస్ విధానానికి స్వస్తి పలకాలని పలువురు కెప్టెన్లు, కోచ్‌లు ఈ కాన్‌క్లేవ్‌లో బోర్డును కోరారు. టాస్ అనేది లేకుండా బ్యాటింగా లేదా ఫీల్డింగ్ ఎంచుకునే విధంగా పర్యాటక జట్టుకు నేరుగా అవకాశం కల్పించాలని కోరారు. అంతేకాక దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ఆవశ్యకతపై కూడా చర్చ జరిగింది.అయితే కోచ్‌లు, కెప్టెన్లు చేసిన సూచనలు కార్యరూపం దాల్చాలంటే బీసీసీఐ టెక్నికల్ కమిటీ అనుమతి తర్వాత జనరల్ బాడీ ఆమోదం తప్పనిసరిగా కావాలి. కొంతకాలంగా ఎడ్‌హక్ బాడీ పాలనలో ఉన్న బీసీసీఐలో ప్రస్తుతానికి టెక్నికల్ కమిటీ కానీ జనరల్ బాడీ కానీ లేదు. ఈ కాన్‌క్లేవ్‌లో బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, సీఈవో రాహుల్ జోహ్రీ, జనరల్ మేనేజర్(క్రికెట్ ఆపరేషన్స్) సబా కరీమ్ తదితరులు పాల్గొన్నారు.