హైదరాబాద్, వెలుగు : రక్తం అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో హిమో సర్వీస్ ల్యాబొరేటరీస్ పేరిట ఓ అపార్ట్‌మెంట్‌లో నడుస్తున్న కంపెనీపై డీసీఏ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఇక్కడ భారీ మొత్తంలో బ్లడ్, బ్లడ్ ప్లాస్మా, సీరం, రక్తాన్ని పరీక్షించే టెస్టింగ్ కిట్లను సీజ్ చేశారు.
ఈ ముఠా తెలంగాణ, ఏపీలోని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, హాస్పిటళ్ల నుంచి రక్తం, ప్లాస్మా, సీరం, ఇతర కాంపోనెంట్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్రైవేటు ల్యాబ్‌లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ హాస్పిటళ్లు, కర్నూల్‌లోని ఓ హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్ల అటెండర్లు, డోనర్ల నుంచి బ్లడ్, బ్లడ్ కాంపోనెంట్స్‌ను సేకరించి ఈ ముఠాకు అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు.
2016 నుంచి ఈ దందా జరుగుతోందని, ఇప్పటివరకు 6 వేల యూనిట్లకు పైగా సేకరించారని తెలిపారు. సేకరించిన యూనిట్లను తెలంగాణ, ఏపీ, కర్నాటకలోని పలు ఫార్మా కంపెనీలకు, రీసెర్చ్ ల్యాబ్‌లకు నిందితులు అమ్ముకుంటున్నారు. 150 మిల్లీ లీటర్ల ఒక్కో ప్లాస్మా యూనిట్‌ను రూ.700కు కొనుగోలు చేసి, రూ.3,800కు అమ్ముతున్నట్టు గుర్తించామని కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు ఆర్.రాఘవేంద్ర నాయక్‌ను అరెస్ట్ చేశామని, ఈ ముఠాతో క్రయ విక్రయాలు జరిపిన సంస్థలకు డీసీఏ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు.