V6 News

టెన్త్ నుంచే గంజాయి, డ్రగ్స్..స్టూడెంట్స్ను టార్గెట్ చేసిన మాఫియా

టెన్త్ నుంచే గంజాయి, డ్రగ్స్..స్టూడెంట్స్ను టార్గెట్ చేసిన మాఫియా
  • సప్లయ్  చైన్​లో టెన్త్, ఇంటర్, బీటెక్  విద్యార్థులు
  • గ్రామాల దాకా పాకిన మత్తు
  • హైదరాబాద్​కు వచ్చి మరీ కొనుగోలు చేస్తున్న యువత
  • ఇంటెలిజెన్స్ రిపోర్ట్​లో సంచలన విషయాలు
  • ఈగల్​తో కలిసి స్పెషల్ యాక్షన్ ప్లాన్​పై సర్కారు ఫోకస్

హైదరాబాద్  సిటీ శివారుకు చెందిన రాహుల్ (పేరు మార్చాం) చదువులో చురుగ్గా ఉండే విద్యార్థి.  పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్నేహితుల ద్వారా గంజాయికి పరిచయమయ్యాడు. సరదాగా మొదలైన ఈ అలవాటు నెల తిరిగేసరికి వ్యసనంగా మారింది. ట్యూషన్  ఫీజు కోసం ఇచ్చిన డబ్బులను గంజాయి కోసం ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సరిపోకపోయేసరికి, స్కూల్  బ్యాగులో గంజాయి పొట్లాలు పెట్టుకుని తోటి విద్యార్థులకు అమ్మే సప్లయర్ గా మారాడు. చివరికి డ్రగ్స్  మత్తులో స్కూల్  గోడ దూకి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడు అతను జువెనైల్  హోంలో కౌన్సెలింగ్ తీసుకుంటున్నాడు.

వరంగల్  జిల్లా కేంద్రంలో ఒక ఇంజినీరింగ్​ కాలేజీలో కిరణ్ (పేరు మార్చాం) హాస్టల్  గదిలో సీనియర్లతో కలిసిన సావాసం అతన్ని గంజాయి వైపు మళ్లించింది. నెలకు వేల రూపాయలు ఖర్చయ్యే ఈ వ్యసనం కోసం కిరణ్  తన ల్యాప్‌‌టాప్‌‌, మొబైల్‌‌ను కూడా తాకట్టు పెట్టాడు. గంజాయి  కొనేందుకు డబ్బుల కోసం తన బైక్‌‌పై హైదరాబాద్‌‌  వెళ్లి మరీ సరుకు తెచ్చి కాలేజీ పరిసరాల్లో విక్రయించడం ప్రారంభించాడు. క్రమంగా గంజాయి నెట్‌‌వర్క్  గ్యాంగ్‌‌లతో సంబంధాలు ఏర్పడి నేర ప్రవృత్తికి అలవాటుపడ్డాడు. ఒకరోజు పోలీసుల తనిఖీల్లో దొరికిపోవడంతో కటకటాలపాలయ్యాడు. కిరణ్  భవిష్యత్తు ఇప్పుడు కోర్టులు, కేసుల చుట్టూ తిరుగుతోంది. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత.. మత్తు కోరల్లో చిత్తవుతోంది. నిన్నమొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్  మహమ్మారి.. ఇప్పుడు మారు మూల పల్లెలను కూడా వణికిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. టెన్త్  క్లాస్  కుర్రాళ్ల నుంచి బీటెక్  యువకుల వరకు డ్రగ్  మాఫియా తన నెట్‌‌వర్క్‌‌ను విస్తరించుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్  నివేదికలోని అంశాలు విస్తు పోయేలా ఉన్నాయి.

గ్రామాల్లోని టెన్త్ ,ఇంటర్​ విద్యార్థులు సైతం గంజాయి సేవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో జరిగిన పోలీస్ తనిఖీల్లో స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థులు గంజాయి పొట్లాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. పోలీసులు వారిని విచారించినప్పుడు పాకెట్ మనీ కోసం తాము సప్లయర్లుగా మారినట్లు ఒప్పుకున్నారు. గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా సైతం  విద్యార్థుల్లో  గంజాయి, డ్రగ్స్  వినియోగం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.​ ఈ నేపథ్యంలో ‘ఈగల్’ నిఘా నీడన స్పెషల్ యాక్షన్ ప్లాన్‌‌తో సర్కారు రంగంలోకి దిగింది.

విద్యార్థులనే సప్లయర్లుగా మారుస్తూ

డ్రగ్స్ మాఫియా  పంథా మార్చింది. ధనవంతుల పిల్లలనే కాకుండా సామాన్య, మధ్యతరగతి విద్యార్థులను కూడా తమ నెట్‌‌వర్క్‌‌లోకి లాగుతోంది. పదో తరగతి నుంచే పిల్లలకు గంజాయి రుచి చూపిస్తూ వారిని బానిసలుగా మార్చుకుంటోంది. ఒకసారి అలవాటుపడ్డాక, ఆ మత్తు కోసం డబ్బులు లేక ఇబ్బంది పడే విద్యార్థులనే తిరిగి 'సప్లయర్లు'గా మార్చుకుంటోంది. గవర్నర్, ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ ప్రకారం ఇంటర్, బీటెక్ చదివే యువత ఇప్పుడు ఈ చైన్ సిస్టమ్‌‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌‌కు వచ్చి గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్  రిపోర్ట్‌‌లో తేలింది. నగరంలోని ధూల్‌‌పేట్  వంటి పాతబస్తీ ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్‌‌లోని శివారు ప్రాంతాల్లో ఈ లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. విద్యార్థుల హాస్టళ్లు, కాలేజీ క్యాంటీన్లు, చివరకు  చిరుతిళ్ల  బంకులు కూడా ఈ మాఫియాకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రత్యేక యాప్​లు, కోడ్​ ప్రభుత్వానికి అందిన తాజా ఇంటెలిజెన్స్ నివేదిక రాష్ట్రంలో మత్తు మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టం చేస్తోంది. 

గతంతో పోలిస్తే గంజాయి వినియోగదారుల సగటు వయసు భారీగా తగ్గిందని, ముఖ్యంగా 14 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న వారే అధికంగా బాధితులవుతున్నట్లు తెలిసింది. ప్రత్యేక యాప్​లు, సోషల్ మీడియా గ్రూపులు, కోడ్ లాంగ్వేజీలను వాడుతూ యువకులు పోలీసుల కళ్లు గప్పుతున్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులు, కిరాణాకొట్టు పరిసరాల్లో కూడా మత్తు దందా సాగుతోంది. సప్లయ్ చైన్‌‌లో విద్యార్థులే డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుండడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. 

ప్రత్యేక మానిటరింగ్‌పై ఫోకస్​ 

ప్రభుత్వం ఈ విష సంస్కృతిని తుదముట్టించాలని నిర్ణయించింది. యాంటీ నార్కోటిక్స్  బ్యూరో ‘ఈగల్’   బృందాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌‌  చేపట్టింది. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్‌‌ల నెట్‌‌వర్క్‌‌ను పెకిలించేందుకు యాక్షన్ ప్లాన్  రూపొందించింది.