హైదరాబాద్ రాయదుర్గం పబ్లో డ్రగ్స్ కలకలం.. సౌండ్ ఇంజినీర్ అరెస్ట్

హైదరాబాద్ రాయదుర్గం పబ్లో డ్రగ్స్ కలకలం.. సౌండ్ ఇంజినీర్ అరెస్ట్

తెలంగాణ నార్కో టిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీమ్. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అయినప్పటికీ డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. అధికారుల కళ్లు గప్పి అక్కడో ఒక్కడో డ్రగ్స్ వాడకం జరుగుతూనే ఉంది. ఈగల్ టీమ్ చేపట్టిన తనిఖీల్లో హైదరాబాద్ రాయదుర్గం ఏరియాలోని పబ్ లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. 

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అబాన్ పబ్‌లో మాదాపూర్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం (జులై 12) అర్ధరాత్రి చేపట్టిన ఈ సోదాల్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 
వివిధ పబ్‌లలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మణి రామన్ అనే వ్యక్తికి నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పబ్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.

ఈ ఘటనతో నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో మరోసారి బట్టబయలైంది. పోలీసులు మణి రామన్ పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

అంతకు ముందు కొంపల్లిలోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ లో డ్రగ్స్ తో పలువురు అరెస్టైన విషయం తెలిసిందే. హోటల్ యజమాని నైజీరియన్ యువతులతో డ్రగ్స్ సరఫరా చేయిస్తుండటంతో పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లేటెస్ట్ గా రాయదుర్గం పబ్ లో సౌండ్ ఇంజినీర్ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.