
- ఇద్దరిని అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్
- 60 గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ముంబయి నుంచి సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేందుకు యత్నించిన ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5లక్షల విలువ చేసే 60 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ గ్యాంగ్ వివరాలను సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌కుమార్‌తో కలిసి సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ రమణా రెడ్డి శుక్రవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన చుక్వెమెక(28) ఎంబీఏ పూర్తి చేశాడు. బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చి నవీ ముంబయిలోని ఖర్‌ఘర్‌లో ఉంటున్నాడు.
థానే జిల్లా ముంబ్రాలో ఉండే మహ్మద్ హసన్ షేక్(40)తో కలిసి ఫుట్‌వేర్ బిజినెస్ చేశాడు. గోవా, ముంబయిలోని నైజీరియన్లతో చుక్వెమెకకు కాంటాక్ట్స్ ఉన్నాయి. దీంతో హసన్ షేక్ తో కలిసి ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లయ్ ప్రారంభించాడు. ముంబయిలోని మెయిన్ డ్రగ్ డీలర్స్ నుంచి మెఫిడ్రిన్ కొనుగోలు చేసి ఖర్‌ఘర్, తలుజ, వసయ్ ఏరియాల్లో అమ్మేవాడు.సిటీలో అమ్మేందుకు వచ్చి దొరికిన్రుసిటీలో డ్రగ్స్ అమ్మేందుకు వీరిద్దరు ప్లాన్ చేశారు. ముంబయిలోని పెడ్లర్ల నుంచి 60 గ్రాముల మెఫిడ్రిన్ కొన్నారు. ఒక్కో గ్రామును ప్యాక్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు.
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి డ్రగ్స్ కస్టమర్ల కోసం సెర్చ్ చేశారు. డ్రగ్స్ సప్లయ్ గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, నాంపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ టీమ్ వీరిపై నిఘా పెట్టింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకుని 40 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకుంది. హసన్ ఇచ్చిన సమాచారంతో లక్డీకపూల్లో చుక్వెమెకను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 20 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఫోన్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా కస్టమర్లను గుర్తిస్తామని అడిషనల్ డీసీపీ రమణా రెడ్డి తెలిపారు.