పాస్ పోర్ట్ తిరిగివ్వాలని కోర్టులో ఆర్యన్ ఖాన్ పిటిషన్

పాస్ పోర్ట్ తిరిగివ్వాలని కోర్టులో ఆర్యన్ ఖాన్ పిటిషన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇన్వాల్వ్ అయి ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది.  ఈ నేపథ్యంలోనే ఆర్యన్.. కొన్ని రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించి.. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చారు. అయితే ఎన్సీబీ నుండి క్లీన్ చిట్ పొందిన ఆర్యన్... తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక (ఎన్‌డిపిఎస్) NDPS కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా విచారణను జూలై 13కి వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా హైప్రొఫైల్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గత ఏడాది అక్టోబర్ ప్రారంభంలో అరెస్టు చేసింది. అయితే మేలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో దర్యాప్తు ఏజెన్సీ అతన్ని నిందితుడిగా పేర్కొనలేదు. "తగిన సాక్ష్యాలు లేనందున" ఆర్యన్ ఖాన్ తో పాటు, మరో ఐదుగురిని కూడా NCB విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల మేరకు ఆర్యన్ ఖాన్ తన పాస్‌పోర్టును కోర్టులో సమర్పించారు. అయితే తన పేరు లేని చార్జిషీట్‌ను ఉటంకిస్తూ, తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ తన లాయర్లు అమిత్ దేశాయ్ మరియు దేశాయ్ దేశాయ్ కారింజీ మరియు ముల్లాకు చెందిన రాహుల్ అగర్వాల్ ద్వారా ప్రత్యేక కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించాడు. ముంబై తీరంలో గోవాకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు.. ఆర్యన్ ఖాన్ ను గత ఏడాది అక్టోబర్ 3న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.