కేరళ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌‌ విలువ రూ .25 వేల కోట్లు

కేరళ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌‌ విలువ రూ .25 వేల కోట్లు
  •     3 రోజుల కిందట 2,500 కిలోల మెథాం ఫెటామిన్​ను స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ అధికారులు
  •     తొలుత రూ.12 వేల కోట్లని అంచనా
  •     స్వచ్ఛమైన డ్రగ్‌‌ అని తేలడంతో   మరోమారు విలువ కట్టిన ఆఫీసర్లు

కొచ్చి: మూడు రోజుల కిందట కేరళ తీరంలో స్వాధీనం చేసుకున్న 2,500 కిలోల డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు కాదని, రూ.25 వేల కోట్లు అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌‌సీబీ) వెల్లడించింది. తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్.. అత్యంత స్వచ్ఛమైన మెథాంఫెటామిన్ అని, అందుకే విలువ పెరిగిందని సోమవారం ప్రకటించింది. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మెథాంఫెటామిన్​ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని తెలిపింది. ‘‘స్వాధీనం చేసుకున్న నిషేధిత డ్రగ్ నాణ్యత ఎక్కువని తనిఖీల్లో గుర్తించాం. దాని విలువ సుమారు రూ.25,000 కోట్లుగా అంచనా వేశాం” అని ఎన్‌‌సీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో పాకిస్తాన్‌‌ లింకుల గురించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అరెస్టు చేసిన పాక్ పౌరుడిని కోర్టులో  ప్రవేశపెడతామని, కస్టడీకి ఇవ్వాలని కోరుతామని వివరించారు. ‘‘ప్రొడక్ట్‌‌ను ప్రొఫెషనల్‌‌గా ప్యాక్ చేశారు. ఎక్కువ రోజులు ఓడలో ఉన్నా కూడా తేమ ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారు. పలు మందుల తయారీ కంపెనీలకు ఇందులో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నాం” అని చెప్పారు.  

ఆపరేషన్​ సముద్రగుప్త

శనివారం ఎన్సీబీ, నేవీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్​తోపాటు ఓ పాక్ దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ సముద్రగుప్త’ పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్​కుమార్ తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా డ్రగ్స్​ రవాణా అవుతున్నాయని, ఏడాదిన్నర కాలంలో భారీస్థాయిలో డ్రగ్స్​పట్టుకోవడం ఇది మూడోసారి అన్నారు. ఇప్పటిదాకా 3,200 కిలోల మెథాంఫెటామిన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషీష్​ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.