డ్రంకెన్​ డ్రైవే కాదు.. తాగి క్యాబ్‌‌  ఎక్కినా బుక్కైతరు

డ్రంకెన్​ డ్రైవే కాదు..  తాగి క్యాబ్‌‌  ఎక్కినా బుక్కైతరు

ఫుల్లుగా పార్టీ చేసుకుని, పీకల దాకా తాగి కారులో వెళ్లేవాళ్లు డ్రంకెన్​డ్రైవ్​లో బుక్కయిపోతున్న సంగతి తెలిసిందే. దాని నుంచి తప్పించుకునేందుకు చాలా మంది క్యాబ్​లు బుక్​ చేసుకుని పోతుంటారు. అయితే, అదీ నేరమే!! అవును, అయితే ఇక్కడ కాదు లెండి. గుజరాత్​లో. న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ జోర్​దార్​గా చేసుకునేందుకు జనం రెడీ అవుతున్నారు కదా. పార్టీ అంటే మందూ ఉంటది కదా. దానికి చెక్​ చెప్పేందుకే గుజరాత్​ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని క్యాబ్​ సంస్థలతో మీటింగ్​ కూడా పెట్టారు. ఎవరైనా ఫుల్లుగా తాగి క్యాబ్​ బుక్​ చేసినా, తమతో పాటు మందు తీసుకొచ్చుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాళ్లకు సూచించారు.

గుజరాత్​లో మందును నిషేధించి చాలా రోజులైందన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా మందు వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో కూడా చూస్తున్నాం కదా. అందుకే న్యూ ఇయర్​ రోజు ఎవరైనా మందు తాగి క్యాబులెక్కినా, మందు తీసుకుపోయినా నేరమేనంటున్నారు. అంతేకాదు, ఎక్కినోళ్ల గురించి పోలీసులకు చెప్పకుండా రైడ్​కు తీసుకెళితే క్యాబ్​ డ్రైవర్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. ‘‘మేం ఈ మధ్యే క్యాబ్​ ఆపరేటర్లతో మీటింగ్​ పెట్టాం. న్యూ ఇయర్​ సందర్భంగా ట్రాఫిక్​ కష్టాలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటే మందు తాగే వాళ్ల గురించీ చర్చించాం. ఎవరైనా తాగేసి క్యాబ్​ ఎక్కితే పోలీసులకు పట్టివ్వాలని చెప్పాం. తాగినా, మందును తీసుకుపోతున్నా వెంటనే లొకేషన్​ షేర్​ చేయాలని చెప్పాం. మేం ట్రాక్​ చేసి తాగినోళ్లను, మందును తీసుకెళ్లేటోళ్లను అరెస్ట్​ చేస్తాం” అని ఓ సీనియర్​ అధికారి చెప్పారు.

ఆరుగురు అరెస్ట్

ఇలాంటి కేసుల్లో ఇప్పటికే తాగి క్యాబ్​లో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్​ చేశారు. అందులో బెంగళూరు, విజయవాడకు చెందిన వ్యక్తులున్నారు. మందు తీసుకెళుతున్న మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు విదేశీయుడు. తాగినోళ్లు ఎవరైనా క్యాబ్​ ఎక్కితే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు చెప్పినట్టు సబర్మతికి చెందిన ఓ క్యాబ్​ డ్రైవర్​ చెప్పాడు. ఇంతకుముందు తన క్యాబ్​లో ఎవరైనా ఇల్లీగల్​ యాక్టివిటీస్​కు పాల్పడితే చెప్పాలన్న ఆదేశాలున్నాయన్నారు.