ఓ క్రికెటర్ నన్ను 15వ అంతస్తులో వేలాడదీసిండు

ఓ క్రికెటర్ నన్ను 15వ అంతస్తులో వేలాడదీసిండు

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తాజాగా ఓ భయంకరమైన విషయాన్ని పంచుకున్నాడు. 2013లో తాగిన మైకంలో ఓ క్రికెటర్ తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లు పేర్కొన్నాడు. అయితే, ఆ క్రికెటర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. టీమ్ మేట్ రవిచంద్రన్ అశ్విన్ తో  ఇంటర్వ్యూలో చాహల్ చెప్పిన ఈ విషయాన్ని.. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకూ ఎవ్వరికీ చెప్పలేదు. ఇకపై అందరికీ తెలిసిపోతుంది. అది 2013లో నేను ముంబై తరఫున ఆడినప్పుడు జరిగింది. బెంగళూరులో మేం ఒక మ్యాచ్‌ గెలిచాక పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్‌ తాగిన మైకంలో ఉన్నాడు. నన్ను చాలాసేపు గమనించి తనవద్దకు రమ్మని పిలిచాడు. అతడి వద్దకు వెళ్లగానే.. నన్ను ఎత్తుకొని బాల్కనీలో 15వ అంతస్తులో వేలాడదీశాడు. అప్పుడు నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. ఏ మాత్రం పట్టు సడలినా నా పని అయిపోయేది. వెంటనే అక్కడున్న వారు స్పందించడంతో బతికిపోయా. ఆ సమయంలో కళ్లు తిరిగి భయమేసింది.  ఆ సంఘటనతో ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉండాలో తెలిసొచ్చింది’ అని చాహల్ చెప్పాడు. అలా తాను తృటిలో చావు నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నాడు. ఏమాత్రం తప్పిదం జరిగినా ప్రాణాలతో బయటపడేవాడిని కాదన్నాడు.

ఇకపోతే, 2013లో ముంబై తరఫున ఆడిన చాహల్‌.. ఆ తర్వాత బెంగళూరు జట్టుకు వెళ్లిపోయాడు. అక్కడ కీలక స్పిన్నర్‌గా మంచి గుర్తింపు దక్కించుకొని ఆ జట్టులో అంతర్భాగమయ్యాడు. అయితే, ఈ సీజన్‌కు ముందు బెంగళూరు వదిలేయడంతో మెగా వేలంలో రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత టోర్నీలో ఆ జట్టు తరఫున ఆడుతున్న చాహల్‌.. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం:

వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్

విమెన్ క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

మహిళా ఎంపీతో థ‌రూర్ చిట్‌చాట్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌