అక్కడికి ఎలా ఎక్కావురా..? 90 కోసం.. తిరుపతిలో గుడి గోపురం ఎక్కి మందుబాబు హల్చల్..

అక్కడికి ఎలా ఎక్కావురా..? 90 కోసం.. తిరుపతిలో గుడి గోపురం ఎక్కి మందుబాబు హల్చల్..

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. శనివారం ( జనవరి 3 ) తెల్లవారుజామున ఆలయంలోని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ప్రవేశించిన మందుబాబు సిబ్బందికి చుక్కలు చూపించాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనే లోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించిన మందుబాబు.. మహాద్వారం లోపల ఉన్న గోవింద రాజస్వామి ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు. అతనిని ఆలయం గోపురం పైనుంచి కిందికి దించేందుకు మూడు గంటలు పాటు శ్రమించారు తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది.

క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే ఆలయం గోపురం పై నుంచి కిందికి దిగుతాను అంటూ షరతులు విధించాడు మందుబాబు. అతనిని నిజామాబాద్ జిల్లా కూర్మ వాడ , పెద్దమల్లా రెడ్డి కాలనీ కు చెందిన కుత్తడి తిరుపతి(45) గా గుర్తించారు పోలీసులు.తిరుపతిలో నివాసం ఉంటూ భార్య భర్తలు కూలి పని చేసుకుంటున్నారని, వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ పాప,8 తరగతి చదువుతున్న బాబు సంతానం ఉన్నట్లు తెలిపారు పోలీసులు.

మూడు గంటల పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని అంగీకరించాడు కుత్తడి తిరుపతి.తిరుపతిని విచారించిన తర్వాత అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామని తెలిపారు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం.