వాటర్ ట్యాంక్ ఎక్కి మందు తాగిండు... దిగుతుండగా జారి పడి యువకుడి మృతి

వాటర్ ట్యాంక్ ఎక్కి మందు తాగిండు... దిగుతుండగా జారి పడి యువకుడి  మృతి

గచ్చిబౌలి, వెలుగు: ప్రైవేటు హాస్టల్‌‌‌‌ భవనం మీద కూర్చొని మందుతాగిన యువకుడు కిందకు దిగబోయి జారిపడి చనిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సీహెచ్. నరేశ్(33) నగరానికి వచ్చి రాపిడో బైక్ నడుపుతూ గౌలిదొడ్డి కేశవనగర్ లోని వినాయక మెన్స్ హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తన పక్క రూమ్‌‌‌‌లో ఉండే సాయి, సుబ్బారావు హాస్టల్ భవనం 5వ అంతస్తుపై ఉన్న వాటర్ ట్యాంక్ మీద కూర్చుని మందు తాగారు.  వారిని చూసిన నరేశ్ మద్యం తీసుకొని వాటర్ ట్యాంక్ పైకి వెళ్లి వారితో మాట్లాడుకుంటూ మద్యం తాగాడు. 

అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సాయి, సుబ్బారావు వారి గదిలోకి వెళ్లారు. సీసాలో మరికొంత మద్యం ఉందని తాను తరువాత వస్తానని చెప్పిన నరేశ్ అక్కడే కూర్చున్నాడు. సోమవారం ఉదయం మరోగదిలో ఉండే వెంకట నితిన్ అనే యువకుడు ఆరేసిన బట్టలు తీసేందుకు పైకి రాగా నరేశ్ కిందపడిపోయి ఉండటాన్ని గమనించాడు. హాస్టల్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. 

మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ నుంచి దిగితూ కాలు జారి స్లాబ్ మీద పడటంతో తలకు వెనక భాగంలో గాయమై మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. డెడ్‌‌‌‌ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేపట్టారు.