ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కరోనా పేషంట్లకు అవకాశం ఇచ్చారు. దుబ్బాక డిగ్రీ కాలేజీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పేషంట్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిని 108 వాహనంలో పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1068 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ పూర్తయ్యే సరికి ఇది మరింత పెరిగే అవకాశముంది.

దుబ్బాకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85.99 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గంలో నమోదు అయిన పోలింగ్ శాతం 73.86 శాతం.