రేవంత్​రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలె

రేవంత్​రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలె

న్యూఢిల్లీ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. కాంగ్రెస్​ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వస్తారా లేదా అన్నది అప్పుడు తేలుతుందని, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో రఘునందన్​ మీడియాతో మాట్లాడారు. ‘‘విలువలు, వలువలకు తేడా తెలియని వ్యక్తి వ్యక్తి రేవంత్ రెడ్డి. బీఫాం ఇచ్చిన టీడీపీకి,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో ఆయన చేరారు. దాదాపు 14 నెలలు టీడీపీ ఎమ్మెల్యే గా ఉండి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారిన చరిత్ర ఆయనది” అని విమర్శించారు. అడ్డదారుల్లో పదవులు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.