గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తం..తప్పేంటీ?:ఏపీ సీఎం చంద్రబాబు

గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తం..తప్పేంటీ?:ఏపీ సీఎం చంద్రబాబు
  • నదిలో పుష్కలంగా నీళ్లున్నయ్.. తీసుకుపోతే తప్పేంటి?: చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు
  • నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు
  • స్టోరేజీ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది 
  • తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి
  • దేవాదుల, కల్వకుర్తి, భీమాలాంటి ప్రాజెక్టులను నేనే రూపొందించా
  • హైదరాబాద్‌‌ను నాలెడ్జ్​ సిటీగా తయారు చేశానని వెల్లడి
  • పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వాటిని రాయలసీమకు తరలిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పొదుపు చేసిన నీళ్లను రాయలసీమకు తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని, అవసరమైతే తెలంగాణకూ నీళ్లిచ్చేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. 

నీటి విషయంలో  రాజకీయాలు చేయొద్దని అన్నారు. తెలంగాణలో రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడుతున్నారని, ఇది మంచిపద్ధతి కాదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదని అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం సరికాదని, ప్రజల కోసం రాజకీయం చేస్తే వారికి మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిపై ఒకసారి ఆలోచించాలని కోరారు. 

తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి, భీమాలాంటి ప్రాజెక్టులను తానే రూపొందించానని చెప్పారు. సాగర్​ ప్రాజెక్టు మీద ప్రపంచంలోనే హయ్యెస్ట్​ రేంజ్​ లిఫ్ట్​ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును నిర్మించానని పేర్కొన్నారు. ఆర్డీఎస్‌‌‌‌కు నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చామని తెలిపారు. ప్రపంచానికి ఓ గొప్ప సిటీ ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌‌‌‌ను నాలెడ్జ్​ సిటీగా తయారు చేశానని అన్నారు. 

హైటెక్​ సిటీ, ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్​, సైబరాబాద్‌‌‌‌లాంటివన్నీ అభివృద్ధి చేశానని చెప్పారు. తెలుగుజాతి బాగు కోసమే ఇదంతా చేశానని, కానీ ఇప్పుడు ఈ రాజకీయాలేంటని ప్రశ్నించారు. తెలుగుజాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప విరోధాలు పెంచుకొని ఆనందించే స్థితికి రాకూడదని ఆయన చెప్పారు. భావోద్వేగాలతో ఆటలాడడం మంచిదికాదన్నారు. 

మీరూ దేవాదులను పెంచుకోండి

పోలవరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అవసరమైతే దేవాదులను మరింత ఎత్తు పెంచుకోవచ్చని, తెలంగాణను ఎవరు అడ్డుకుంటారని అన్నారు.  గోదావరిలో పోలవరానికి ఎగువన దేవాదుల ఉంటుందని, అక్కడి నుంచే ఏపీకి నీళ్లు రావాల్సి ఉంటుందన్నారు. అక్కడి నుంచి పోలవరం దిగువకు సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామని చెబుతున్నామన్నారు. కిందకు వచ్చే నీళ్లను వాడుకుంటామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు. 

దేవాదులకు తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. పోలవరం– నల్లమలసాగర్​ ద్వారా తరలించే నీళ్లలో.. మిగిలిన వాటిని సాగర్​, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చని తెలిపారు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టమని, కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందరికీ మేలు జరుగుతుందని వివరించారు. 

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయని, దాని వల్ల దిగువన విజయవాడ మునిగిపోయిందని చెప్పారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేయడం, ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన కల అని చంద్రబాబు తెలిపారు.