భార్యా భర్తల మధ్య అభిప్రాయ బేధాలవల్లే గొడవలు

భార్యా భర్తల మధ్య అభిప్రాయ బేధాలవల్లే గొడవలు

పెళ్లంటే జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా కలిసి నడవాలి. కానీ, మారుతున్న పరిస్థితులు, ఒత్తిడి వల్ల చిన్న  చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక కూడా ‘ నా.. నీ..’ అనుకోవడం వల్ల అభిప్రాయ బేధాలు వచ్చి, గొడవలు మరీ ఎక్కువవుతున్నాయి. సాధారణంగా కొత్తగా పెళ్లైన  ప్రతీ జంట ఒకటి, రెండు సంవత్సరాలు కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే చాలా వరకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ మనస్పర్థలు విడాకులకు దారితీస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలతో జీవితాంతం పశ్చాత్తాప పడకుండా ఉండాలంటే మీ జీవిత భాగస్వామితో ఇలా మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు.

టైం కేటాయించాలి

ఈ మధ్య కాలంలో భార్యాభర్తల అనుబంధానికి పని ఒత్తిడే కాదు.. టెక్నాలజీ కూడా అడ్డుగా మారుతోంది. దాంతో ఇద్దరూ ఏకాంతంగా గడిపే టైం తగ్గుతోంది. అందుకే ఇంటి వద్ద ఫోన్, ల్యాప్​టాప్, టీవీ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు మెయిల్స్‌ చూసుకోవడం, ఫోన్‌ మాట్లాడటం లాంటి వాటికి దూరంగా ఉండాలి. తప్పనిసరి అయితే వాటికి కొంత టైమిచ్చి, ఆ తర్వాత భాగస్వామికి టైం కేటాయించుకునేలా చూసుకోవాలి.

సర్దుకుపోవాలి

పొద్దున లేస్తూనే భార్యాభర్తలిద్దరూ పనులకు పరిగెత్తే కాలం ఇది.  ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటేనే  సమయానికి ఆఫీసుకి చేరుకోగలరు. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అభిప్రాయభేదాలను దూరం చేసుకొని ఒకే దారిలో నడవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పొరపాట్లు సహజం. అవి ఇద్దరిలో ఎవరి వల్లయినా జరగొచ్చు. ప్రతీ సమస్యని మీవైపు నుంచి కాకుండా ఎదుటివారి కోణంలో కూడా చూడండి. భాగస్వామిలో ఏదైనా లోపం, సమస్య ఉందని గుర్తించినప్పుడు... గొడవ జరిగినప్పుడు  పదే పదే వాటిని ప్రస్తావించడం చాలామంది చేసే పొరపాటు.  గతాన్ని పదే పదే తవ్వి  లోపాలను ఎత్తి చూపడం వల్ల మనస్పర్థలు మరింత పెరుగుతాయి. నిజానికి అవతలి వారిలో లోపాలు కనిపించినా వాటిని కొన్నిసార్లు వాటిని వేలెత్తిచూపకపోవడం మంచిది. మితిమీరితే మాత్రం దానిపై చర్చించాలి. 

నేనేం తక్కువ

ఒకప్పుడు ఎక్కువగా నిరక్షరాస్యులైన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయినా వాటికి సర్దుకుపోయి కలిసి ఉండేవాళ్లు. కానీ, ప్రస్తుతం డిగ్రీలు, బీటెక్​, పీహెచ్​డీలు చేసి, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. క్షణికావేశంతో విహహ బంధాన్ని తెంచుకుంటున్నారు. కొందరైతే  ‘నేనేం తక్కువంటే,  నేనేం తక్కువ’ అంటూ ఆధిపత్య ధోరణితో పంతాలకు పోతున్నారు. కానీ, ఈ పద్ధతి మంచిది కాదు.  వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలి. ఒకరి కోసం మరొకరు ఆలోచించి  నడుచుకుంటూ బంధాన్ని బలపరుచుకోవాలి. 

మనసు విప్పి మాట్లాడుకోండి

రోజులో మీ జీవితభాగస్వామితో  మాట్లాడేందుకు కేటాయించే సమయం ఎంత... ఆ సమయంలో మీ ఇంటి  బాధ్యతలూ, ఇతర పనుల గురించి  కాకుండా  కేవలం మీ ఇద్దరి గురించి మాట్లాడుకునే సమయం ఎంతో గమనించుకోండి.  అలా కానీ లేదంటే ఇక మీదట కొంత సమయం  కచ్చితంగా కేటాయించుకోండి.  ఉదయాన్నే లేచి నడవడం, వారాంతాల్లో  ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకుని కలిసి పనులు చేసుకోండి , మనసారా మాట్లాడుకోండి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడల్లా మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం మానేస్తే ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మట్లాడి పరిష్కరించుకోండి. మిమ్మల్ని బాధపెట్టిన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమై ఒకరికొకరు దగ్గరవుతారు.