భారీ వర్షాలతో మళ్లీ నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

భారీ వర్షాలతో మళ్లీ నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌ లో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. గత రెండు రోజులుగా నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా యాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు రాష్ట్రాల రహదారులు, 10 లింక్ రోడ్లను మూసివేశారు. మందాకిని, అల‌క‌నంద న‌దులు ఉధృతంగా ప్రవ‌హిస్తున్నాయి. కేదార్‌నాథ్ యాత్ర ఈ సంవత్సరం ఏప్రిల్ 25న ప్రారంభమవగా పలు కారణాలు వల్ల చాలా సార్లు నిలిపి వేశారు. తాజాగా మరోసారి భారీ వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ పడింది.

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఐఎండీ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నట్లు ఐఎండీ ట్వీట్ చేసింది. ఐఎండీ హెచ్చరిక‌ల నేప‌థ్యంలో త‌మ ప్రభుత్వం అప్రమ‌త్తంగా ఉంద‌ని సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, పీడబ్ల్యూడీ శాఖ‌ల‌న్నీ రెఢీగా ఉన్నట్లు చెప్పారు. గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం (జులై 11న) కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల న‌లుగురు మృతిచెందారు. 10 మంది గాయ‌ప‌డ్డారు.