పండగ రైళ్లలో సీట్లన్నీ ఫుల్

పండగ రైళ్లలో సీట్లన్నీ ఫుల్

సికింద్రాబాద్​,వెలుగు: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి నెలన్నర ముందే జర్నీ కష్టాలు మొదలయ్యాయి. ఏ రైలులో చూసినా ఒక్క సీటు రిజర్వేషన్​ ఖాళీగా  లేదు. ఏపీ వైపు వెళ్లే రైళ్లల్లో  సీట్లన్నీ ఫుల్​గా నిండిపోయాయి.  ఒక్కో రైలులో వందల్లో వెయిటింగ్​ లిస్ట్​ ఉంది. రైల్వే స్పెషల్​ ట్రైన్స్​ నడిపితే తప్ప సొంతూరిలో పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్యాసింజర్ల రద్దీని బట్టి స్పెషల్ ట్రైన్స్​ రన్​చేసేందుకు రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఏపీకి వెళ్లే రైళ్లన్నీ ఫుల్​
 
సంక్రాంతి సెలవులు జనవరి 9 నుంచి మొదలవుతుండగా ఏపీకి వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్​బుకింగ్​ చేసుకోగా రైళ్లలో సీట్లన్నీ ఫుల్​అయ్యాయి. వచ్చే నెల 13న కూడా టికెట్లు దొరికే పరిస్థితులు లేవు. ఏపీకి వెళ్లే గోదావరి, గౌతమి, గరీబ్​ రథ్​ వంటి రెగ్యులర్ ​రైళ్లు  ఫుల్​గా బుక్​ అయ్యాయి. ఫలక్​నుమా, ఎల్​టీటీ ,కోణార్క్​ వంటి  రైళ్లలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. సికింద్రాబాద్ ​నుంచి వైజాగ్​, కాకినాడ, నర్సాపూర్​, తెనాలి  వైపు రిజర్వేషన్ ​పూర్తియింది. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకైతే అసలు టికెట్లు దొరకడం లేదు. ఒడిశా,  బెంగాల్​ వైపు వెళ్లే రైళ్లలో  కూడా బెర్త్​లు  ఖాళీగా లేవు. 

స్పెషల్​రైళ్ల కోసం వెయిటింగ్​

సంక్రాంతికి  రైళ్లన్నీ  ఫుల్​గా రిజర్వ్​ కావడంతో ఇప్పుడు ప్యాసింజర్లు స్పెషల్ ​రైళ్ల కోసం వెయిట్​ చేస్తున్నారు.   స్పెషల్​ రైళ్లు నడిపితే  సీట్​ రిజర్వేషన్ ​చేసుకునేందుకు చూస్తున్నామంటున్నారు.  ప్రతిసారి సంక్రాంతికి రైల్వే శాఖ ఏపీకి స్పెషల్​ రైళ్లను నడుపుతుంది. గతేడాది కరోనా కారణంగా సాధారణ  రైళ్లు తప్పితే స్పెషల్ ట్రైన్స్​నడపలేదు. ఈసారి నడుపుతుందా..? లేదా..? ఒకవేళ నడపకుంటే ఎలా వెళ్లాలనే కన్​ ఫ్యూజన్​లో ప్యాసింజర్లు పడిపోయారు. పండుగకు ప్యాసింజర్ల సౌకర్యార్థం స్పెషల్ రైళ్లు నడపాలని రైల్వే యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. రద్దీని పరిగణలోకి తీసుకుని స్పెషల్​ రైళ్లను నడిపేందుకు రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు.