3.85 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే

3.85 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే
  • యాదాద్రి జిల్లాలోని రైస్‌‌మిల్లుల్లో 3.85 లక్షల టన్నుల ధాన్యం
  • 25 రోజులుగా మూతబడిన మిల్లులు
  • ఉపా ధి కోల్పోయిన 2 వేల మంది కార్మికులు

యాదాద్రి, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాలతో టన్నుల కొద్దీ వడ్లు మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. కేంద్రం ఇచ్చే ఫ్రీ బియ్యం రాష్ట్రం పంపిణీ చేయకపోడవం, సీఎంఆర్‌‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో తెలంగాణ నుంచి సీఎంఆర్‌‌ తీసుకోబోమని కేంద్రం ప్రకటించింది. దీంతో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా రైస్‌‌ మిల్లులు మూతబడ్డాయి. దీంతో సుమారు 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

3.85 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే...

యాదాద్రి జిల్లాలో మొత్తం 100కు పైగా రైస్‌‌ మిల్లులు ఉండగా ఇందులో 41 మిల్లులకు సీఎంఆర్‌‌ కోసం సివిల్‌‌ సప్లై డిపార్ట్‌‌మెంట్‌‌వడ్లను సరఫరా చేస్తోంది. 
ఈ మిల్లుల్లో 2020–‌‌‌‌-21 యాసంగి సీజన్‌‌కు సంబంధించి 8,500 టన్నుల​వడ్లతో పాటు 2021 వానాకాలానివి 1.80 లక్షల టన్నులు, 2021-–22 యాసంగి సీజన్‌‌వి 1.96 లక్షల టన్నల వడ్లు నిల్వ ఉన్నాయి. అలాగే జూన్‌‌ ఫస్ట్‌‌ వీక్‌‌ వరకు మిల్లర్లు అందించిన 70 వేల టన్నుల సీఎంఆర్‌‌ బియ్యం గోడౌన్లలో నిల్వ ఉంది. అయితే టెక్నికల్‌‌ కారణాల వల్లే కేంద్రం ఇచ్చే  ఫ్రీ బియ్యాన్ని పంపిణీ చేయలేకపోయామని, జూన్‌‌ నుంచి డిసెంబర్‌‌ వరకు బియ్యాన్ని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయినా 
సీఎంఆర్‌‌ తీసుకునే విషయంపై ఎఫ్‌‌సీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 

రెండు వేల మంది ఉపాధికి గండి

సీఎంఆర్‌‌ సేకరణ నిలిపివేయడంతో తప్పని పరిస్థితుల్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 41 మిల్లులు మూతపడ్డాయి. గత నెల 7 నుంచి మిల్లుల్లో పని లేకపోవడంతో హమాలీలతో పాటు, మిగతా పనులు చేసే సుమారు 2 వేల మంది కార్మికుల ఉపాధిపై దెబ్బ పడింది. దీంతో మిల్లుల్లో పనిచేసేందుకు ఒడిశా, బీహార్‌‌ నుంచి వచ్చిన లేబర్లు సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు వడ్ల స్టాక్‌‌ మొత్తం మిల్‌‌ ఆవరణలోనే ఉండడంతో వర్షాలు పడితే తడిసిపోయే ప్రమాదం ఉంది. అలాగే వర్కర్ల జీతాలు, మిల్లు మెయింటెనెన్స్‌‌ మీద పడుతుండడంతో భారీ మొత్తం నష్టపోతున్నామని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టపోతున్నాం 

సెంట్రల్, స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ మధ్య విభేదాల కారణంగా సీఎంఆర్‌‌ సేకరణ నిలిచిపోయింది. దీంతో నెల క్రితం రైస్‌‌ మిల్లును మూసేశాం. మిల్లులోని వడ్ల స్టాక్‌‌ మొత్తం ఆరుబయటే ఉంది. వర్షాలు పడుతుండడంతో వడ్లు తడిసే ప్రమాదం ఉంది. పైగా వర్కర్స్‌‌ జీతాలు, మిల్లు మెయింటెనెన్స్‌‌ చెల్లించాల్సి వస్తుండడంతో ప్రతి నెల లక్షల్లో నష్టపోతున్నాం. – మంచికంటి భాస్కర్‌‌, రైస్‌‌మిల్లర్‌‌, చౌటుప్పల్‌‌