విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయినయ్

విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయినయ్
  • డిస్కంల ఆస్తులన్నీ తాకట్టు.. అప్పు చేస్తేనే జీతాలకు పైసలు  
  •  అగ్రికల్చర్‌‌ కరెంట్​కు సర్కారు బాకీ రూ.25 వేల కోట్లు  
  •  ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బాకీ రూ. 17,500 కోట్లు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కన్పిస్తున్న కరెంట్ వెలుగులన్నీ పైపై మెరుగులేనని, సర్కార్ తీరుతో విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. చివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నా డిస్కంలు అప్పులు చేయక తప్పని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. డిస్కంల ఆస్తులన్నీ కుదువపెట్టడంతో కనీసం వాటిని అమ్ముకుని గట్టెక్కేందుకు కూడా అవకాశం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయానికి, ఇతరులకు డిస్కంలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. దీనికి సంబంధించి సర్కారు పైసలు ఇవ్వకపోవడంతో డిస్కంలు ఆస్తులను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి కరెంట్ సప్లై చేస్తున్నాయి. ఏండ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్పులు ఎలా తేవాలి? తెచ్చిన అప్పులను ఎలా కట్టాలి? అనేది డిస్కంలకు అంతుపట్టడంలేదు. ఇప్పటికే విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక విద్యుత్‌‌ వినియోగదారుల నుంచి లోడ్‌‌ పెరిగిందంటూ అడిషనల్‌‌ చార్జీలు, డెవలప్‌‌మెంట్‌‌ చార్జీల పేరిట ముక్కు పిండి వసూళ్లు చేసి కొంత నెగ్గుకొచ్చినయి. మున్ముందు ఉద్యోగుల శాలరీలకు కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. గతంలో ఫస్ట్‌‌ తారీఖునే జీతలిచ్చిన విద్యుత్‌‌ సంస్థలు ఇప్పడు10 తారీఖు వరకు కానీ ఇచ్చే పరిస్థితి లేదు.   

సర్కార్ వేల కోట్లు బాకీ...    

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌‌ సరఫరాకు సంబంధించి రూ.25 వేల కోట్ల మేర విద్యుత్‌‌ సంస్థలకు సర్కారు బకాయిపడింది. ఎలక్షన్‌‌ ఇయర్‌‌లో కరెంట్ చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కారు విద్యుత్‌‌ సంస్థలకు  రూ.12,500 కోట్లు ఐదేండ్లలో చెల్లిస్తామని ఈఆర్‌‌సీకి లెటర్‌‌ ఇచ్చి చేతులు దులుపుకున్నది. మిగతా రూ.12,500 కోట్ల గురించి కనీసం ప్రస్తావించలేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, సర్కార్ ఆఫీసులు వాడుకున్న కరెంట్​కు సంబంధించి రూ.17,500 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు మరో రూ.10 వేల కోట్లు బాకీ పడ్డట్లు సమాచారం. ఎలక్షన్‌‌ల వరకు ఎట్లనో నెగ్గుకరాండి తరువాత చార్జీలు పెంచుకోవచ్చని డిస్కంల పెద్దలకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

సింగరేణికి డిస్కంల బాకీ రూ.28 వేల కోట్లు  

సింగరేణి నుంచి కొనుగోలు చేసిన కరెంట్, బొగ్గుకు సంబంధించి రూ.28 వేల కోట్ల వరకు డిస్కంలు బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఇందులో కరెంట్ కొనుగోళ్లకు సంబంధించి రూ.18 వేల కోట్లు, జెన్ కో బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి రూ.10 వేల కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. డిస్కంల నుంచి పైసలు వచ్చే చాన్స్ లేకపోవడంతో లాభాల్లో ఉన్న సింగరేణి కూడా ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన కరెంట్​కు డిస్కంలు చెల్లించాల్సిన బాకీలు కూడా వేల కోట్లకు పెరిగాయి. తలసరి విద్యుత్‌‌ వినియోగంలో రాష్ట్రమే నంబర్‌‌ వన్‌‌ అని సర్కార్ చెప్తోంది. కానీ, కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన 51 ర్యాంకింగ్స్​లో ఎస్పీడీసీఎల్​కు 43వ ర్యాంక్, మైనస్ సీ గ్రేడ్, ఎన్పీడీసీఎల్​కు 47వ ర్యాంక్, మైనస్ సీ గ్రేడ్ దక్కాయి.  

పవర్ ప్లాంట్లు పూర్తికాలే 

ఐదేండ్లలో పూర్తి చేస్తామని ప్రకటించిన 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్‌‌ ప్లాంట్ నేటికీ పూర్తి కాలేదు. దీనికోసం ఆర్‌‌ఈసీ, పీఎఫ్‌‌సీ సంస్థల నుంచి సర్కారు రూ.వేల కోట్లు అప్పులు చేసింది. రామగుండంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌‌టీపీసీ చేపట్టిన పవర్‌‌ ప్లాంట్‌‌లో రెండో దశకు నేటికీ కనీసం స్థలం చూపించకుండా నిర్లక్ష్యం చేస్తోంది.   

తెలంగాణ ఇంజినీర్లకు రివర్షన్‌‌లు

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పోరాటం కీలకమైంది. ఎంతో మంది ఇంజినీర్లు, కాంట్రాక్టు కార్మికులు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమించి ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించారు. కానీ రాష్ట్రం వచ్చాక వారికి ప్రమోషన్లు దక్కక పోగా ఇక్కడి ఇంజినీర్లకు డిమోషన్లు ఇచ్చి ఆంధ్రా ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుదే. అలాగే రాష్ట్రం వస్తే విద్యుత్‌‌ కాంట్రాక్ట్‌‌ కార్మికులను పర్మినెంట్‌‌ చేస్తామని ప్రకటించిన సర్కారు 23 వేల మంది ఆశలపై నీళ్లు చల్లింది.  

చత్తీస్‌‌గఢ్‌‌ ఒప్పందం ఫ్లాప్ 

చత్తీస్‌‌గఢ్‌‌లోని మార్వా థర్మల్‌‌ విద్యుత్‌‌ కేంద్రం నుంచి 12 ఏండ్ల పాటు కరెంట్ కొనుగోళ్ల కోసం తెలంగాణ డిస్కంలకు, చత్తీస్‌‌గఢ్‌‌ సీఎస్‌‌పీడీసీఎల్‌‌ కు మధ్య 2015 సెప్టెంబర్‌‌ 22న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల కరెంట్ సరఫరా చేయాల్సి ఉంది. వార్ధా లైన్‌‌ కారిడార్‌‌ ఏర్పాటు తరువాత కొంత కాలం ఒప్పందం కంటే కొంత తక్కువే కరెంట్ కొనుగోళ్లు జరిగాయి. గత 2020–21లో సగం కంటే తక్కువే  కొనుగోలు చేయగా, 2021–22లో పావు వంతు కూడా తీసుకోలేదు. ఇలా కరెంట్ తగ్గించుకుంటూ 2022–23 నాటికి పూర్తిగా నిలిపేసింది. తమకు బాకీ పడిన రూ.3,576 కోట్లు చెల్లిస్తేనే కరెంట్ సరఫరా చేస్తామని చత్తీస్‌‌గఢ్‌‌ అల్టిమేటం ఇచ్చింది. దీంతో వివాదం కొనసాగుతోంది. సరఫరా లైన్ల కోసం ఏటా వందల కోట్లు మాత్రం ఉత్త పుణ్యానికి కట్టాల్సి వస్తోంది.