సింగరేణి ఓసీపీల్లో  బొగ్గు ఉత్పత్తి బంద్​ ​

 సింగరేణి ఓసీపీల్లో  బొగ్గు ఉత్పత్తి బంద్​ ​
  • రోజుకు 1.60లక్షల టన్నుల ఉత్పత్తికి బ్రేక్

మందమర్రి,వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎనిమిది రోజులనుంచి సింగరేణిలోని  అన్ని ఓసీపీల్లో వాన ఎఫెక్ట్​ కనిపిస్తోంది. ఈనెల 3 నుంచి వానలు పడుతున్నా ఈనెల 5 నుంచి  ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని గనుల్లో ఇంటర్నల్ రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. హెవీ వెహికల్స్ నడిచే పరిస్థితి లేకపోవడంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు నిలిచిపోయి.. బొగ్గు పెల్ల కూడా బయటకు రావడంలేదు. 

మంచిర్యాల, అసిఫాబాద్​ జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లో ఈనెల 3 నుంచి వానలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు రోజుల నుంచి విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. గనుల్లో 24 నుంచి 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే భారీ వర్షం. మంచిర్యాల, అసిఫాబాద్​, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని 19 ఓపెన్​కాస్ట్​  గనుల నుంచి రోజుకు 1,63,268 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది.  సింగరేణిలోని 19 ఓసీపీలు, 24 అండర్​ గ్రౌండ్​ మైన్ల ద్వారా రోజుకు 2.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది టార్గెట్​కాగా ఓసీపీల నుంచే 70 నుంచి 80శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు.  అన్ని ఓసీపీల్లో మైనింగ్​ ఆపరేషన్స్​ఆగిపోవడంతో ఎనిమిది రోజుల్లో సుమారు 13లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో సింగరేణి రోజుకు రూ.45 నుంచి 55 కోట్ల వరకు నష్టపోతోంది.   19 ఓసీపీల్లో కలిపి రోజుకు 13లక్షల క్యూబిక్​ మీటర్ల  ఓవర్​ బర్డెన్ పనులు ఆగిపోయాయి.  ఓపెన్​కాస్ట్​ గనుల్లో మట్టి రోడ్లు ఉండటంవల్ల వానలకు పూర్తిగా పాడయ్యాయి. దీంతో డంపర్​ వెహికల్స్​ నడిపితే బురదలో కూరుకుపోతాయన్న భయంతో వాటిని సర్ఫేస్​లోనే నిలిపిఉంచారు.ఉద్యోగులు, కార్మికులు షెల్టర్లకే పరిమితమవుతున్నారు. కొన్ని చోట్ల ఓసీపీ వర్క్ షాపు ల్లోకి కూడా వరదనీరు చేరింది. దీంతో మెషిన్లను రిపేర్​ చేసే పరిస్థితి లేక వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్వారీల్లో చేరిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు ఎత్తిపోస్తున్నారు. సర్పేస్​లో మాత్రం అన్ని పనులు నడుస్తున్నాయి. ఓసీపీల నుంచి కోల్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్లకు  బొగ్గురావడం తగ్గిపోవడంతో విద్యుత్తు సంస్థలకు రైల్వే రేక్​లను పరిమితంగా పంపుతున్నారు.

వారంలో  10లక్షల టన్నుల బొగ్గు నష్టం 

ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సింగరేణి సుమారు 10లక్షల టన్నుల బొగ్గును నష్టపోయినట్లు సింగరేణి డైరెక్టర్లు  బలరాం(పీపీ, ఫైనాన్స్) , ఎస్​.చంద్రశేఖర్​(ఆపరేషన్స్​) తెలిపారు. సోమవారం అన్ని ఏరియాల  జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై  వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. అండర్​ గ్రౌండ్​ మైన్లలో ఉత్పత్తి పెంచాలని సూచించారు. మందమర్రి, శ్రీరాంపూర్​, భూపాలపల్లి, రామగుండం1 ఏరియాల్లోని యూజీ గనుల్లో ఉత్పత్తి మీద దృష్టి పెట్టాలన్నారు.