కోడ్ కూస్తదేమోనని.. పనుల్లో స్పీడ్.. క్వాలిటీ అడగొద్దు

కోడ్ కూస్తదేమోనని.. పనుల్లో స్పీడ్.. క్వాలిటీ అడగొద్దు
  • ఖమ్మంలో హడావుడిగా అభివృద్ధి పనులు
  • ఇసుక బదులు డస్ట్ ​వినియోగం
  • కట్టిన నెలకే కూలిన డ్రైనేజీ గోడ

ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ఎలక్షన్లపై రూలింగ్​ పార్టీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో హడావుడిగా పలు అభివృద్ధి పనులను చేపడుతోంది. పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్న లీడర్లు నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు సైతం ఇసుక బదులు డస్ట్​ వాడుతూ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. కట్టిన నెల రోజులకే డ్రైనేజీ సైడ్ ​గోడ పడిపోవడం పనుల నాణ్యతను కళ్లకు కడుతోంది.

ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు సంబంధించి డివిజన్ల విభజన ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి అంచనాల ప్రకారం మే నెలలో ఎన్నికలు జరిగే చాన్సుంది. ఈలోగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో మంత్రులు హడావుడి చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రాకముందే ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రారంభించాలని, కొత్త పనులు మొదలు పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్లతో చేపట్టిన కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా, ఈ నెల 15లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. టేకులపల్లి లో 1,100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.

మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్​

మార్చిలో ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈనెల 15 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే చాన్సుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు బ్రేక్ పడుతుంది. ఈ ఇబ్బంది రాకుండా ఇప్పటికే అభివృద్ధి పనులను అధికార పార్టీ నేతలు స్పీడప్ చేశారు. ఖమ్మం నగరంలోని డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, శంకుస్థాపనలకు మంత్రి పువ్వాడ అజయ్ ప్రయారిటీ ఇస్తున్నారు. రోడ్ల వెడల్పు, సెంట్రల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఏడాదిన్నర కాలంలోనే దాదాపు నగరంలో 20 కిలోమీటర్ల ప్రధాన రహదారుల్లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.

పనుల క్వాలిటీపై కంప్లైంట్స్​

మున్సిపల్ జనరల్ ఫండ్స్, ఎల్ఆర్ఎస్ నిధులు, సీఎం హామీ ప్రత్యేక నిధులతో ఆయా పనులు చేపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు హడావుడిగా చేపడుతున్న ఈ పనుల క్వాలిటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా, త్వరగా పని పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల 5వ డివిజన్ లో సైడ్ డ్రైనేజీ కోసం కట్టిన కాంక్రీట్ గోడ నెలరోజుల్లోనే కూలిపోయింది. ఇక సీసీ రోడ్ల పనుల్లో కూడా ఇసుకకు బదులు కొన్ని చోట్ల కంకర పొడి(డస్ట్) వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి.  దాదాపు మూడు నెలల క్రితం 16వ డివిజన్ లోని రామాలయం వీధిలో ఫుట్ పాత్ నిర్మాణంలో ఇసుక అసలు వాడకుండా పూర్తిగా డస్ట్ వినియోగించడంపై స్థానిక బీజేపీ నేతలు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు. విచారణ జరపాలంటూ కమిషనర్ ఆదేశించారు. కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లే బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

క్వాలిటీతో పనులు చేస్తలేరు

కార్పొరేషన్ ఎన్నికల కోసమే అధికార పార్టీ లీడర్లు హడావుడిగా పనులు చేస్తున్నారు. ఎక్కడా నాణ్యత పాటించట్లేదు. సీసీ రోడ్ల కోసం బయటనే కాంక్రీట్ మిక్స్ చేసి, డైరెక్ట్​గా పనులు జరుగుతున్న దగ్గర వాడుతున్నారు. కంకర లేకుండా పనికిరాని దుబ్బ(డస్ట్)ను ఉపయోగిస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. –రుద్ర ప్రదీప్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి.

ఇవి కూడా చదవండి..

ఫ్రస్టేషన్ ​నుంచి ఫన్​లోకి.. వీకెండ్​లో ఎంజాయ్

ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం

సీల్డ్ కవర్​లో మేయర్ పేరు.. ఆశావహుల్లో టెన్షన్

పీపీపీ మోడ్​లో మూసీ నది బ్యూటిఫికేషన్​