కార్మికులకు బకాయిలు చెల్లిస్తం : ఆర్టీసీ సిబ్బందితో ఎండీ సజ్జనార్​

కార్మికులకు బకాయిలు చెల్లిస్తం : ఆర్టీసీ సిబ్బందితో ఎండీ సజ్జనార్​
  • 20వేల మంది ఉద్యోగులతో జూమ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం తెలిపారు. ఇందుకు ప్లాన్ రెడీ చేశామన్నారు. జిల్లాల్లో  పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లతో బస్ భవన్ నుంచి సజ్జనార్​ జూమ్ మీటింగ్​ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు జరిగిన సెషన్లలో సుమారు 20 వేల మంది కార్మికులతో ఎండీ మాట్లాడినట్లు ఆర్టీసీ పత్రిక ప్రకటనలో వెల్లడించింది. కాగా, కార్మికులకు రెండు పీఆర్సీలు, డీఏ బకాయిలు,  పీఎఫ్, ఎస్ ఆర్ బీ ఎస్, ఎసీబీటీ, రిటైర్ అయిన కార్మికుల సెటిల్ మెంట్లు, బకాయిలు  మేనేజ్ మెంట్ చెల్లించాల్సి ఉంది.  ఒక్కో కార్మికుడికి  యావరేజ్ గా రూ.6లక్షలు అందుతాయని అధికార వర్గాలు తెలిపాయి.  ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడంపై  ఇటీవల గెజిట్ వచ్చింది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో  బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు.

పండుగల సీజన్​లో ప్రత్యేక సర్వీసులు

రాబోయే 5 నెలలు సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ సిబ్బందిని ఎండీ  అభినందించారు. రెండేండ్లలో రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించామన్నారు. సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకమనే పరిస్థితి నుంచి ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతూ స్వావలంబన దిశగా వెళ్తున్నదని అన్నారు. పబ్లిక్ లో ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ గ‌‌ణ‌‌నీయంగా పెరిగిందని సజ్జనార్​ చెప్పారు.