నల్లబెల్లి, వెలుగు: వారసత్వ భూమికి సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న ఓ ఆర్‌ఐని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర గ్రామానికి చెందిన లొల్లాటి నర్సయ్య ఇటీవల చనిపోయాడు. తండ్రి పేరున ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమిని తన పేరున వారసత్వ పట్టా (విరాసత్) చేయాలని నర్సయ్య కొడుకు రాజు అప్లై చేసుకున్నాడు. ఈ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు ఆర్‌ఐ గొట్టెముక్కుల రాంబాబు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో రాజు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో రాజు గురువారం దుగ్గొండి తహసీల్దార్ ఆఫీస్‌లో ఆర్‌ఐ రాంబాబును కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆఫీస్‌లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని రికార్డులను సీజ్ చేశారు. మరో నెలలో రిటైర్ కానున్న ఆర్‌ఐ రాంబాబు ఏసీబీకి చిక్కడం మండలంలో కలకలం రేపింది.
