
' లక్కీ బాస్కర్ ' ( Lucky Baskhar )మూవీ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇది ఒక పీరియడ్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ . ఈ చిత్రం ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి వివిధ ఆర్థిక పథకాలు, స్కామ్‌ల ద్వారా పేదరికం నుంచి ధనవంతుడిగా ఎలా ఎదిగాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఎంతో అద్భుతంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ .. మలయాళ సూపర్ స్టార్ 'దుల్కర్ సల్మాన్ ' ( Dulquer Salmaan )ను రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తన కెరీర్‌లో మరో మైలురాయిని నిలిపింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్య పరంగా సక్సెస్ ను అందుకుంది.
'లక్కీ భాస్కర్ 2' పై దర్శకుడు క్లారిటీ..
అయితే ఈ సినిమా విడుదలైన నాటి నుంచీ, దీనికి సీక్వెల్ ఉంటుందా లేదా అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నెలల నిరీక్షణ తర్వాత, దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవలి ఓఇంటర్వ్యూలో దీనికి సీక్వెల్ ఉంటుందని ధృవీకరించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అటు దుల్కర్ సల్మాన్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. 'లక్కీ భాస్కర్ 2' ( Lucky Baskhar 2 ) ఎలా ఉండబోతోంది, కథ ఎక్కడి నుంచి కొనసాగుతుంది, కొత్త పాత్రలు ఏమైనా ఉంటాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. భాస్కర్ తన తదుపరి ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటా!
'లక్కీ భాస్కర్' విడుదల అనంతరం జరిగిన సక్సెస్ ఈవెంట్‌లో, తనకు ఇంతటి గుర్తుండిపోయే చిత్రాన్ని అందించినందుకు చిత్ర బృందానికి దుల్కర్ సల్మాన్ కృతజ్ఞతలు తెలిపారు. నేను తెలుగు సినిమాలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత మనిషిగా ఆరించారని సంతోషం వ్యక్తం చేశారు. నాగ్ అశ్విన్ నన్ను నమ్మి ' మహానటి ' మూవీలో జెమినీ గణేషన్ పాత్రను ఇచ్చారు. హను రాఘవపూడి 'సీతారామం'. జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు . 'లక్కీ భాస్కర్' నా కెరీర్‌లో మరో చిరస్మరణీయ చిత్రం," అని దుల్కర్ భావోద్వేగంగా పంచుకున్నారు.
'లక్కీభాస్కర్' వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు . ఈ చిత్రంలో బాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ , కథానాయికగా మీనాక్షి చౌదరి నటించగా, రామ్కీ, మానస చౌదరి, సూర్య శ్రీనివాస్, టిన్ను ఆనంద్ , రిత్విక్ జ్యోతి రాజ్ , సర్వదమన్ డి బెనర్జీ, , సచిన్ ఖేడేకర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. 'లక్కీ భాస్కర్' సాధించిన విజయం, దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మరింత బలమైన మార్కెట్‌ను సృష్టించగా, వెంకీ అట్లూరికి స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు సీక్వెల్ వార్తతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. 'లక్కీ భాస్కర్ 2' ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎలాంటి కథాంశంతో వస్తుంది, ఈసారి భాస్కర్ ఏ కొత్త సాహసాలు చేస్తాడు అనేది వేచి చూడాలి మరి.