
జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ఏరియాల్లో కెమికల్ డంపింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రమాదకర కెమికల్స్‌ను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా తీసుకొచ్చి నాలాలు, ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై పారబోస్తోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. తమకు అడ్డు వచ్చిన వారిపై ఆ ముఠాలు దాడులు కూడా చేస్తున్నాయి. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పీసీబీ అధికారులపై దాడి చేసి ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లిపోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.
ప్రోత్సహిస్తున్న ఫ్యాక్టరీలు..
జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఉప్పల్, పటాన్చెరు, చర్లపల్లి, బాలానగర్, గాంధీనగర్, కూకట్పల్లి ఇలా పలు ఇండస్ట్రియల్ ఏరియాల్లో వెయ్యికిపైగా ఫార్మా, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాలుష్య తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఇలా ఈ ఫ్యాక్టరీలను పీసీబీ మూడు వర్గాలుగా డివైడ్ చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా అక్కడ వెలువడే ప్రమాదకర వేస్టేజ్ కెమికల్స్‌ను జీడిమెట్లలోని జేఈటీఎల్లేదా పటాన్‌చెరులోని పీఈటీఎల్శుద్ధి కేంద్రాలకు తప్పనిసరిగా పంపాలి. కానీ కొన్ని కంపెనీలు ఇలా చేయకుండా బయటే పారబోస్తున్నాయి. ఇందుకోసం డంపింగ్మాఫియాను ప్రోత్సహిస్తున్నాయి. పర్మిషన్ ఒకదానికి.. తయారు చేసేది మరొకటి సిటీలోని చాలా ఫ్యాక్టరీలు రూల్స్ పాటించడం లేదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. పర్మిషన్ తీసుకునేది ఒకదాని కోసమైతే ఉత్పత్తి చేసేవి మాత్రం వేరే వస్తువులు ఉంటున్నాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేస్టేజ్‌ను శుద్ధి కేంద్రాలకు పంపితే తమ గుట్టు బయటపడుతుందనే భయంతో నాలాలు, ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. ఇందుకోసం కొన్ని ఫ్యాక్టరీలు డంపింగ్ మాఫియాను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కాగా ఈ మాఫియా కొంత మంది ప్రజాప్రతినిధులు అండతో రెచ్చిపోతోన్నట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ ప్రమాదకర కెమికల్స్‌ను పారబోస్తున్నారు. ఇలా పార బోస్తూ పలు సందర్భాల్లో అధికారులకు పట్టుపడిన సందర్భాలూ కూడా ఉన్నాయి.
గతంలో జరిగిన ఘటనలు..
జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర వేస్టేజ్‌ను నాలాలో పోస్తుండగా ఐలా అధికారులు పట్టుకున్నారు. వెంటనే డంపింగ్ మాఫియాకు చెందిన వ్యక్తులు అక్కడికి వచ్చి బెదిరించి ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లారు. ఐడీఏ బొల్లారంలో గస్తీ తిరుగుతున్న పీసీబీ బృందం ఓ ట్యాంకర్‌ను పట్టుకుంది. దీంతో కొంత మంది కత్తులతో అధికారుల వెహికల్స్‌ను సూరారం వరకు వెంబడించారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని నాలాలో కెమికల్ డంపింగ్చేస్తున్న ట్యాంకర్‌ను పీసీబీ అధికారులు ఇటీవల పట్టుకోగా వారిని కొట్టి ఆ ముఠా ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లింది.
దాడులకు భయపడం
కాలుష్య నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. డంపింగ్ మాఫియా దాడులకు భయపడేదిలేదు. పీసీబీ అధికారులపై ఈ దాడులు కొత్తేమీ కాదు. ముఠాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ బృందాలను ముమ్మరం చేసి తనిఖీలు చేపడుతాం. రూల్స్ పాటించని కంపెనీలను మూసివేస్తాం.
రాజేందర్, మేడ్చల్‌జిల్లా పీసీబీ రీజినల్ ఆఫీసర్