ఉధృతంగా పారుతున్న దుందుభి, ఊకచెట్టువాగు

ఉధృతంగా పారుతున్న దుందుభి, ఊకచెట్టువాగు

నవాబ్​పేట/అడ్డాకుల/జడ్చర్ల టౌన్​, వెలుగు : అల్పపీడన ప్రభావంతో పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు  కురుస్తున్నాయి.  దీంతో వాగులు, వంకలు పొంగడంతో పాటు చెరువులు అలుగు పారుతున్నాయి. అనేక చోట్ల వాగులు కల్వర్టులు ఎక్కి పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోతున్నాయి.  

రాకపోకలు బంద్

భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని ఊకచెట్టువాగు ఉప్పొంగింది.  దీంతో వర్నె ముత్యాలంపల్లి మధ్యలో ఉన్న రోడ్డు  కోతకు గురైంది. రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో కన్మనూరు, బలీదుపల్లి, వర్నె, ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్​హెచ్​-44 నుంచి బలీదుపల్లి మధ్య ఉన్న గాజుల వంపు వద్ద ఉన్న కల్వర్టు మీదుగా ప్రమాదకరంగా పారుతుండడంతో అటు, ఇటు కనెక్షన్ కట్ అయ్యింది. దాదాపు 20 ఎకరాల్లో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి.  నవాబ్​పేట మండలం కొండాపూర్​ గ్రామంలో ఉన్న తూము చెరువు నుంచి వస్తున్న వరద తాళ్లవాగు కల్వర్టుపై నుంచి పారుతుండటంతో నవాబ్​పేట, యన్మన్​గండ్ల, రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న దాదాపు 50 ఎకరాల వరి పంట దెబ్బతిన్నది.  సాయంత్రం ఏడు గంటల తర్వాత వరద ఉధృతి తగ్గడంతో పోలీసులు జేసీబీ సాయంతో వాహనాలను దాటించారు.  అలాగే  దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా  తాడూరు మండలం సిరసవాడ వద్ద రోడ్డుపై నుంచి  పారుతుండడంతో ఆర్డీవో నాగమణి  ముళ్లకంప వేయించి కట్టెలతో బారికేడ్లు కట్టించారు.